- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుడు అశోక్‌నగర్ లైబ్రరీ గుర్తుకు రాలేదా?.. కేటీఆర్‌పై శ్రీధర్ బాబు ఫైర్
నిరుద్యోగుల గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటనలో పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: నిరుద్యోగుల గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటనలో పేర్కొన్నారు. పదేళ్లలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి, నిరుద్యోగుల జీవితాలను అంధకారం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తుంటే వారిని చూసి యావత్ తెలంగాణ సమాజం నవ్వుకుంటున్నదని ఎద్దేశా చేశారు. అశోక్‌నగర్ లైబ్రరీ సాక్షిగా పదేళ్లు నిరుద్యోగులను వంచించిన చరిత్ర బీఆర్ఎస్‌ది కాదా అని ప్రశ్నించారు. నాడు నోటిఫికేషన్ల పేరుతో ఊరించి, పరీక్షల పేరుతో వేధించి, నిరుద్యోగులను రోడ్ల పాలు చేసింది ఎవరని నిలదీశారు. ‘అధికారం పోగానే నిరుద్యోగులు గుర్తొచ్చారా..? రాజకీయం కోసం బురద చల్లడం మానేసి, మేము ఇచ్చిన అపాయింట్‌మెంట్ ఆర్డర్లను ఒకసారి లెక్కపెట్టుకోండి. అప్పుడు తెలుస్తుంది దమ్ము ఎవరిదో.. మోసం ఎవరిదో!’ అని సూచించారు.
70 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు
టీజీపీఎస్సీ క్వశ్చన్ పేపర్లను పప్పుబెల్లాల్లా బజార్లో పెట్టి అమ్ముతుంటే... కళ్లు అప్పగించి చూసింది బీఆర్ఎస్ నేతలు కాదా అని ప్రశ్నించారు. లీకేజీలతో లక్షలాది మంది నిరుద్యోగుల ఉసురుపోసుకున్న పాపం మీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థతత బీఆర్ఎస్ నేతలదని.. రెండు సార్లు ప్రిలిమ్స్ రద్దు కావడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు మానసిక వేదనకు గురయ్యారని.. అప్పుడెందుకు మాట్లడలేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే ఉద్యోగ భర్తీని మీలా లైట్‌గా తీసుకోలేదని.. ఒక పవిత్ర కార్యంగా తీసుకున్నామని పేర్కొన్నారు. ఎక్కడా ఎలాంటి లీకేజీలకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఇప్పటికే 70 వేల మందికి ప్రభుత్వోద్యోగాలు కల్పించామని తెలిపారు. తెలంగాణ రైజింగ్‌లో భాగస్వామ్యం చేశామని.. ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిలో ఎక్కువ మంది బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారే ఉన్నారని పేర్కొన్నారు. గ్రూప్ 1, 2, 3 పరీక్షల నిర్వహణ విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. త్వరలోనే గ్రూప్ 3 అపాయింట్ ఆర్డర్లను కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అది నిరుద్యోగుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న తన కమిట్మెంట్ అని సూచించారు.
పనిగట్టుకొని నా మాటలు వక్రీకరిస్తున్నారు..
తాను శాసనమండలిలో అన్న మాటలను కొందరు కావాలనే పనిగట్టుకుని వక్రీకరిస్తున్నారని.. తమ స్వార్థ రాజకీయాల కోసం నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కానీ.. తాను ఆ మాట అన్నది నిరుద్యోగులను తక్కువ చేయడానికి కాదని, తెలంగాణ భవిష్యత్తు మీరే అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని తాము ఒక బాధ్యతగా తీసుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది నిరుద్యోగులున్నారని.. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే.. మరోవైపు పరిశ్రమల ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్‌పై దృష్టి సారించి ప్రైవేట్ రంగంలోనూ తెలంగాణ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.






