కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగొద్దు

by Ratna Kumari |

కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అన్యాయం జరగకుండా రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగొద్దు
X

దిశ, మోత్కూరు : కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అన్యాయం జరగకుండా రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని దత్తప్పగూడెం గ్రామంలో ఇటీవల కూతురు, కుమారుడిని కోల్పోయిన వెలుగు సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అధికారాలు అనుభవించి, అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరి పదవులు పొందిన కారణంగా అసలు కాంగ్రెస్ కార్యకర్తలు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య సమన్వయ లోపం ఏర్పడిన విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి తనతో ప్రస్తావించారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, వారిని కాపాడుకోవడం పార్టీ అధిష్టానం బాధ్యత అని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైతే పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ విద్యార్థుల సమస్యలపై గాంధేయ మార్గంలో నిరసన చేపట్టారని, అలాంటి నాయకుడిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తీవ్రంగా ఖండించారు.

విద్యార్థులపై లాఠీచార్జీలు, బాష్పవాయు ప్రయోగించడం బాధాకరమని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సహజమేనని, వాటిని సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర నాయకత్వంపై ఉందన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి కొనసాగుతోందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వంగాల సత్యనారాయణ, నాయకులు అవిశెట్టి ఆవిలిమల్లు, పైల్ల సోమిరెడ్డి, పల్లెపాటి యుగంధర్, తండ సత్తయ్య, మోత్కూరు మున్సిపల్ కౌన్సిలర్లు కారుపోతుల వెంకన్న, కురుమిళ్ల ప్రమీల, మెంట రమణ తదితరులు పాల్గొన్నారు.

Next Story