TG: డాన్స్ చేసిన మంత్రి సీతక్క

by Gantepaka Srikanth |

ఆదివాసీ సంస్కృతికి దేశ సరిహద్దులు, భాషలు అడ్డుకావని, ప్రపంచంలోని ఎక్కడైనా ఆదివాసీలు అడవి, ప్రకృతి మీదే ఆధారపడి జీవనం సాగిస్తారని రాష్ట్ర గ్రామీణాభివ్రుద్ది, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

TG: డాన్స్ చేసిన మంత్రి సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆదివాసీ సంస్కృతికి దేశ సరిహద్దులు, భాషలు అడ్డుకావని, ప్రపంచంలోని ఎక్కడైనా ఆదివాసీలు అడవి, ప్రకృతి మీదే ఆధారపడి జీవనం సాగిస్తారని రాష్ట్ర గ్రామీణాభివ్రుద్ది, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివాసీ జీవన విధానం, విశ్వాసాలు ప్రపంచవ్యాప్తంగా ఒకే తత్వాన్ని ప్రతిబింబిస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత సమ్మక్కసారలమ్మ మహాజాతర సందర్భంగా సోమవారం న్యూజిలాండ్‌కు చెందిన మావోరి తెగ ప్రతినిధులు మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేడారం గద్దల ప్రాంగణంలో మావోరి తెగ వారి సంప్రదాయ నృత్యమైన హాకా నృత్యాన్ని ప్రదర్శించారు. హాకా నృత్యం అనేది మావోరి తెగలో యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో తమ సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు, శత్రువుల్లో భయాన్ని కలిగించే విధంగా చేసే సంప్రదాయ నృత్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ నృత్యంలో ముఖభావాలు, శరీర చలనలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. తెలంగాణ న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క చొరవతో మావోరి తెగ ప్రతినిధులు మేడారం మహాజాతరను సందర్శించారు. హాకా నృత్య ప్రదర్శన సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి నృత్యం చేసి వారి ఉత్సాహాన్ని పెంచారు. అనంతరం మావోరి తెగ ప్రతినిధులను గద్దల వద్దకు తీసుకెళ్లి వన దేవతల దర్శనం చేయించారు. సమ్మక్క సారలమ్మ వన దేవతల వైభవం, చరిత్రను మంత్రి సీతక్క స్వయంగా వారికి వివరించారు. ఈ సందర్భంగా బంగారం, వన దేవతల ప్రసాదాన్ని అందజేసి మావోరి తెగ ప్రతినిధులను సన్మానించారు.

Next Story