‘తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఉన్నత స్థాయికి ఎదగాలి’.. విద్యార్థులకు మంత్రి పొన్నం పిలుపు

by Jakkula.Mamatha |

వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యార్థుల అల్పాహారం – పాలు పథకాన్ని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఖైరతాబాద్‌లోని రాజ్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు.

‘తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఉన్నత స్థాయికి ఎదగాలి’.. విద్యార్థులకు మంత్రి పొన్నం పిలుపు
X

దిశ, ఖైరతాబాద్: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యార్థుల అల్పాహారం – పాలు పథకాన్ని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఖైరతాబాద్‌లోని రాజ్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యశస్వినీ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, డీఈవో యాదయ్య, మన్నా ట్రస్ట్ సీఈవో లీనా జోసెఫ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 29 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, పాలు పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం, ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తోడ్పడడం, పాఠశాల హాజరును పెంచడం, డ్రాప్‌అవుట్‌లను తగ్గించడం, విద్యా ఫలితాలను మెరుగుపరచడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ‘బడిబాట’ కార్యక్రమం చేపట్టామని, పాఠశాల మానేసిన విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలంటే విద్యా ప్రమాణాలు మెరుగుపడాలని, అందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని చెప్పారు.ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఉదయాన్నే పాఠశాలకు వచ్చి అల్పాహారం తీసుకోవడంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా పాఠశాలలోనే చేయాలని సూచించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఈ పథకానికి ఏటా రూ.720 కోట్లు వెచ్చించనుంది. ఇందులో అల్పాహారం కోసం రూ.540 కోట్లు, పాల సరఫరా కోసం రూ.180 కోట్లు ఖర్చు చేయనుంది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం అమలు కానుంది.

వారంలో అందించే అల్పాహారం మెనూ..

సోమవారం: దోసె-చట్నీ/చపాతీ-కూర, పాలు..

మంగళవారం: మిల్లెట్ ఇడ్లీ-సాంబార్, రాగి జావ

బుధవారం: పూరీ-ఆలూ కుర్మా, పాలు

గురువారం: మిల్లెట్ ఇడ్లీ-సాంబార్, రాగి జావ

శుక్రవారం: మిల్లెట్ ఉప్మా/పొంగల్-చట్నీ, పాలు

శనివారం: బొండా-చట్నీ, రాగి జావ

హైదరాబాద్ జిల్లాలో మొత్తం 672 ప్రభుత్వ పాఠశాలల్లో 93,501 మంది విద్యార్థులు చదువుతున్నారు. తొలి దశలో 45 పాఠశాలలను ఎంపిక చేయగా, 12,437 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. మన్నా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు కానుంది. ఇందులో 23 ప్రాథమిక పాఠశాలలు, 2 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు, 20 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులకు ఉదయం పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, ఏకాగ్రత, పాఠశాల హాజరు మరియు విద్యా నాణ్యతను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగి విద్యార్థుల నమోదు సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story