రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.. మంత్రి పొంగులేటి కీలక పిలుపు

by Jakkula.Mamatha |

అమరవీరుల త్యాగాల పునాదులపై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.. మంత్రి పొంగులేటి కీలక పిలుపు
X

దిశ, వరంగల్ బ్యూరో: అమరవీరుల త్యాగాల పునాదులపై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హన్మకొండ కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం అత్యంత వైభవంగా అవతరణ వేడుకలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రతి పౌరుడిలో ఆత్మగౌరవాన్ని, బాధ్యతను పెంపొందించే సందర్భంగా నిలవాలన్నారు. రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన ప్రగతి, ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను వివరిస్తూ మంత్రి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నగర ప్రముఖులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఘన సన్మానం..

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘనంగా సన్మానించి వారి సేవలను, త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ సాధన కోసం అమరవీరులు చేసిన త్యాగాలు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు..

విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారులు, విద్యార్థులు తమ ప్రతిభతో వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించిన శాఖల ప్రదర్శనలు..

జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేశారు. డీఆర్‌డీఏ, మెప్మా, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, టీజీఎస్‌సీఓ, గృహ నిర్మాణ శాఖ, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖల స్టాళ్లను మంత్రి సందర్శించి శాఖల కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు కూడా ప్రదర్శనలను పరిశీలించారు.

ప్రతిభకు ప్రశంసలు..

ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి తెలంగాణ పోలీసుల సేవా పథకాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు మంత్రి అందజేసి అభినందించారు.

Next Story