TG: రెవెన్యూ ఉద్యోగులకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-06 14:36:11  IST  )

రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రెవెన్యూ శాఖలో సంస్కరణలను ప్రవేశ పెట్టి, పక్కాగా అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్​ప్రజా ప్రభుత్వానిదేనని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు.

TG: రెవెన్యూ ఉద్యోగులకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రెవెన్యూ శాఖలో సంస్కరణలను ప్రవేశ పెట్టి, పక్కాగా అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్​ప్రజా ప్రభుత్వానిదేనని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లో సురవరం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ‘ట్రెసా’ డైరీ ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై డైరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే మార్చినాటికి ‘భూభారతి’ యాప్‌లో సర్వేకు సంబంధించిన అంశాలను పటిష్టపరిచి పునరుద్ధరిస్తామని తెలిపారు. 7,500 మంది వరకు లైసెన్స్‌డ్, ప్రభుత్వ సర్వేయర్లను కూడా నియమిస్తామని ప్రకటించారు.

ప్రభుత్వ ఆర్థిక వెసలుబాటు చూసుకొని పరిష్కరిస్తాం

రెవెన్యూ భూరికార్డులతో పాటు సర్వే మ్యాప్స్, వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలన్ని ప్రపంచంలో ఏమూలన ఉన్నా.. చూసుకునే విధంగా ఒకే వేదికపైకి తీసుకొస్తామని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు సానుకులంగా పరిష్కరించేందుకు త్వరలో ట్రెసా సంఘం నాయకులతో భేటీ అవుతానని, ప్రభుత్వ ఆర్థిక వెసలుబాటు చూసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్​రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలని, 61 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకాలు, ఇతర నియోజకవర్గాలకు కేటాయించిన జీపీవోలను సొంత నియోజకవర్గాలకు బదిలీ చేయాలని మంత్రి శ్రీనివాస్​రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్ మాట్లాడుతూ జీపీవో వ్యవస్థ వలన గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా ఉందని, ఆ మనోబలంతో ధైర్యంగా పనిచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఈజాక్​చైర్మన్ మారం జగదీశ్వర్, టీఈజాక్​సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు, ట్రెసా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పడిగెల రాజ్‌కుమార్, కల్చరల్ డైరక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి కె.చంద్రకళ, అసోసియేట్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి, టీఎన్​జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్, టీజీవో ప్రధాన కార్యదర్శి శ్యాం, ట్రెసా రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకటేశ్వర్లు, నిరంజన్, చక్రవర్తి, శాస్త్రి, వాణిరెడ్డి, వాణి, నాగమణి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story