‘నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజీ పై కేంద్రం నిర్లక్ష్యం’.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజం

by Jakkula.Mamatha |

నీట్ ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

‘నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజీ పై కేంద్రం నిర్లక్ష్యం’.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజం
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: నీట్ ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం భువనగిరిలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటమాడుతోందని ఆరోపించారు. నీట్ పరీక్షల అవకతవకల వల్ల ఎంతోమంది విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేంద్ర ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం విచారకరమన్నారు.

గత 12 ఏళ్ల పాలనలో దాదాపు 152 సార్లు వివిధ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, ఎన్డీయే ప్రభుత్వం మాటలకే పరిమితమై చేతల్లో తీవ్ర వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. ఈ ఘోర వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం నిస్వార్థంగా పోరాడుతున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర నాయకులను అరెస్టు చేయడాన్ని, ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో చిన్న ఆరోపణ రాగానే మంత్రులు రాజీనామాలు చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, కేంద్ర ప్రభుత్వం కంటితుడుపు చర్యలు ఆపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Next Story