ఈనెల 17న సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండకు రాక.. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి

by Jakkula.Mamatha |

నల్గొండ జిల్లా, కనగల్ మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకానున్న బహిరంగ సభ స్థలాన్ని ,హ్యాం రోడ్ల పైలాన్, హెలిప్యాడ్ స్థలాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు.

ఈనెల 17న సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండకు రాక.. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, నల్లగొండ క్రైమ్: నల్గొండ జిల్లా, కనగల్ మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకానున్న బహిరంగ సభ స్థలాన్ని ,హ్యాం రోడ్ల పైలాన్, హెలిప్యాడ్ స్థలాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ.. 17వ తేదీ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా, కనగల్ మండలం రానున్నారని, రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరగని రీతిలో ఒకే రోజున ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని రహదారులను డబుల్ రోడ్లుగా మార్చే మొదటి ప్యాకేజీ కనగల్ మండలం, ధర్వేశిపురం నుంచి డిండి వరకు నిర్మించే రహదారితో రాష్ట్రంలోని అన్ని హ్యాం రోడ్లకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఆర్ అండ్ బి రహదారులతో పాటు, మరో 7వేల కోట్ల రూపాయలతో గ్రామాల నుండి మండలాలకు, మండలాల నుంచి జిల్లా కేంద్రం వరకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో డబుల్ రోడ్డు నిర్మించనున్నామని తెలిపారు.

వీటికి వచ్చేవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చేతులమీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రెండు సంవత్సరాలలో హ్యం రోడ్లన్నింటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రోడ్లు ఉంటేనే పరిశ్రమలు, సంక్షేమ ఉంటాయని, అందువల్ల గడచిన సంవత్సరం కాలంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి రిజర్వాంట్ ద్వారా అప్పుగా నిధులు తీసుకుని రోడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేసే ఎస్ఎల్బీసీ సొరంగం కూడా హ్యాం రోడ్లు పూర్తయ్యే లోగా అంటే 2028 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. దీని ద్వారా జిల్లాలో రెండు పంటలకు సాగునీరు అందుతుందన్నారు.

ఇది తన కలల ప్రాజెక్టు అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వీటితోపాటు, ఏఆర్పి కాలువల లైనింగ్ కు 450 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, ఈ శంకుస్థాపన కార్యక్రమం కూడా అదే రోజు ఉంటుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మించే హ్యాం రోడ్లను 34 ప్యాకేజీలుగా విభజించి 6300 కిలోమీటర్ల రోడ్లను డబుల్ రోడ్లుగా మారుస్తున్నట్లు వెల్లడించారు. వీటితోపాటు ,నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో తాగునీటిపై ప్రత్యేక నిధులు మంజూరు చేయించడం జరిగిందని, ఈ పనులకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కనగల్ లోనే శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యం..

రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగా ఈ సంవత్సరం నల్గొండ నియోజకవర్గంలో అత్యధికంగా 2,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా 1800 కోట్ల రూపాయల విలువచేసే ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. రోడ్లు బాగుంటేనే పరిశ్రమలు, వ్యవసాయం వస్తాయని, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. కేంద్ర సిఆర్ఎఫ్ నిధుల ద్వారా నల్గొండ నుండి ధర్వేశిపురం వరకు స్ట్రెయిట్ రోడ్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని, కనగల్ జంక్షన్ అభివృద్ధి ని కూడా హ్యం రోడ్ల లో పెట్టడం జరిగిందన్నారు. వీటితోపాటు, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా మంజూరు అయిందని, ఇదే కాక దాని పక్కనే బుల్లెట్ ట్రైన్ డిపిఆర్ కూడా సిద్ధమవుతున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకానున్న సభకు సుమారు లక్ష మంది ప్రజలు ఈ సభకు హాజరు కానున్నట్లు మంత్రి వెల్లడించారు.

ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని , ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా, బహిరంగ సభకు హాజరయ్యే ప్రజల కోసం అవసరమైన తాగునీరు, టెంట్లు, వాహనాలు ,ఇతర అన్ని సౌకర్యాలు సమకూర్చాలని, ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి సభా వేదిక, వాహనాల పార్కింగ్ ,లైటింగ్ ,లైవ్ టెలికాస్ట్, అలాగే ఇతర ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. అంతేకాక పైలాన్ నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి కార్యక్రమం విజయవంతం అయ్యేలా అధికారులు, అనధికారులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం లో భాగంగా రైతు రుణమాఫీ తో పాటు, రైతు భరోసా ఇస్తున్నదని, మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలకు ఉచిత బస్సు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉదయం అల్పాహారం, అలాగే 200 కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం వంటివి చేపట్టినట్లు వెల్లడించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్, జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డీపీఓ శంకర్ నాయక్, డీఎస్పీ శివరాం రెడ్డి , ఆర్ అండ్ బీ డిఈ గణేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

Next Story