- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విలువలు దిగజారి పోతున్నాయి: మంత్రి కోమటిరెడ్డి
మహిళా ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకొని మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు, ఆధారంలేని ప్రచారాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకొని మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు, ఆధారంలేని ప్రచారాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కలెక్టర్, ఐఏఎస్ అధికారుల బదిలీల్లో మంత్రుల జోక్యం ఉండదని, అలాంటి నిర్ణయాలు పూర్తిగా ముఖ్యమంత్రి పరిధిలో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఐఏఎస్ ఉద్యోగం సాధించడం అంత ఆషామాషీ కాదని, అటువంటి ఉన్నత స్థాయి అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి పేర్కొన్నారు. మహిళా అధికారులను మానసికంగా వేధించే విధంగా వార్తలు ప్రచారం చేయడం అనైతికమని, అన్ని మీడియా యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. వాస్తవాలు ఉంటే సంబంధిత ఆధారాలతో తమ దృష్టికి తీసుకురావాలని, కానీ తప్పుడు వార్తలతో వ్యక్తిగత ప్రతిష్ఠలకు భంగం కలిగించవద్దని హితవు పలికారు. సంక్రాంతి ప్రయాణాలపై ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌కు విస్తృత ఏర్పాట్లపై శనివారం మినిస్టర్ క్వార్టర్స్ లో ఆయన మీడియా సమావేశంలో ప్రసంగించారు. రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయంలోని మహిళా అధికారులు, ఇంచార్జ్ మంత్రులపై కూడా ఆధారంలేని కథనాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తనను ‘నల్గొండ మంత్రి’గా చూపుతూ చేస్తున్న తప్పుడు ప్రచారం సరైంది కాదని అన్నారు. ఈ అంశాలపై డీజీపీతో చర్చించామని, సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులను కోరినట్లు తెలిపారు. నివేదిక వచ్చిన అనంతరం చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. దీనికి కుట్ర అని తాను అనబోనని... అయితే పోలీసుల విచారణలో అన్ని విషయాలు బయట పడతాయన్నారు.
కొడుకు పోయిన బాధను గుండెల్లో దాచుకుని ప్రజాసేవ...
తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవినే త్యాగం చేశానని, వ్యక్తిగతంగా ఎన్నో బాధలు ఎదుర్కొన్నానని మంత్రి గుర్తు చేశారు. తన కుమారున్ని కోల్పోయిన బాధను గుండెల్లో దాచుకుని... ఆయన పేరుతో ప్రజాసేవ చేస్తున్నానని, ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అనేక మంది విద్యార్థులు, విద్యాసంస్థలకు తాను సాయమందిస్తున్నానని తెలిపారు. ఏడాదికి కనీసం వంద మంది విద్యార్థులకు తాను సాయమందిస్తున్నానని అన్నారు. పేద ప్రజలకు సేవ చేస్తున్న తనపై అసత్య ప్రచారాలు చేయడం అన్యాయమని అన్నారు. తన కుమారుడు చనిపోయినప్పుడే సగం చనిపోయానని... రాజకీయాలు కూడా వదిలేయాలని పించిందన్నారు. వేదాంద గ్రూప్ చైర్మన్ లాగా తాను కూడా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉన్నానని అన్నారు. తనను వేధించి, తన కుటుంబాన్ని వేధించి, మహిళా ఆఫీసర్లను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ఐఏఎస్ అధికారులే అవ్వడమే తప్పా... ఇదేం దుర్మార్గమన్నారు. మహిళా అధికారులకు అండగా ఉండాలే కానీ ఇలాంటి కథనాలతో దుష్ప్రచారం చేయడం తగదన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ప్రజల ఆశీర్వాదంతో గెలిచానని, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రికార్డు స్థాయిలో ఎంపీగా గెలిచానని పేర్కొన్నారు. తప్పుడు వార్తలతో తనను మానసికంగా వేధించడం ద్వారా ఏమి సాధిస్తారని ప్రశ్నించారు. తాను దైవభక్తి గలవాడినని, దేవుడిని నమ్ముతానని, చివరికి న్యాయం దేవుడే చూస్తాడని అన్నారు.
తనకు ఇంత విషమిచ్చి చంపేయండి...
అయినా నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి, నా ఇంట్లో ఇబ్బందులు పెట్టి, మహిళా ఆఫీసర్లను ఇబ్బంది పెట్టి మీరు ఏం సాధిద్దామని అనుకుంటున్నారని మంత్రి మీడియాను ఉద్దేశించి ప్రశ్నించారు. మీ రేటింగ్‌లు, వ్యూస్ కోసం అవాస్తవాలు రాయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దని.. ఇది సరైనదే అనుకుంటే కంటిన్యూ చేయాలన్నారు. ఇంకా సరిపోదు అనుకుంటే తనకు ఇంత విషమిచ్చి చంపేయండి అని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్ నంబర్ మార్చానని ఓ చానల్ లో ప్రసారం చేశారని... ఆ నంబర్ చాలా పాతదని... దాదాపు 20 ఏళ్లకు పైగా ఆ నంబర్ వాడుతున్నానని తెలిపారు. అందరి వద్ద ఆ నంబర్ ఉండటంతో అందరు దానికే ఫోన్ చేస్తున్నారని... దాంతో ఆ నంబర్ ను పీఏ వద్ద ఉంచినట్లు తెలిపారు. తనకు గొంతు సంబంధ అనారోగ్య సమస్య ఉందని దాని కోసం అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకున్నా తగ్గడం లేదన్నారు. పుట్టుకతోనే ఉన్న ఈ సమస్యకు తక్కువ మాట్లాడటమే పరిష్కారం అని వైద్యులు సూచించారు. అందుకే తాను తక్కువ ఫోన్ మాట్లాడుతానని చెప్పాను. ఆ నంబర్ తోనే నేను ఆరుసార్లు గెలిచాను. దాన్ని ఎలా పక్కన పెడతానన్నారు. ఎంతో కష్టపడితే ఐఏఎస్‍లు అవుతారు. అలాంటి వారిపై ఆఫీసర్ల మీద అభియోగాలు కరెక్ట కాదన్నారు. తప్పుడు వార్తల ప్రచారం ఇకనైనా ఆపాలని, బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే ప్రజాస్వామ్యం బలపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పునరుద్ఘాటించారు. తనపై వ్యక్తిక్తహననం జరగడం పట్ల మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సంక్రాంతి ట్రాఫిక్ కంట్రల్ నియంత్రణకై విస్తృత ఏర్పాట్లు...
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సమగ్ర చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. ఈసారి సుమారు 12 లక్షల వాహనాలు ఊర్లకు వెళ్లి తిరిగి వస్తాయని అంచనా వేస్తున్నామని, గత ఏడాది 9 లక్షల వాహనాలు ప్రయాణించాయని గుర్తు చేశారు. టోల్ గేట్ల వద్ద భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడితే వెంటనే టోల్ గేట్లు తెరవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. పంతంగి టోల్ గేట్ వద్ద తరచుగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో, అక్కడ టోల్ గేట్ ఓపెన్ చేయాలని సూచించామని తెలిపారు. డీజీపీతో సమన్వయం చేసి భద్రతా ఏర్పాట్లు బలోపేతం చేసినట్లు చెప్పారు. ప్రతి 20 కి.మీకు ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడైనా వాహనాలు ఆగిపోతే వెంటనే క్రేన్ల సహాయంతో క్లియర్ చేసే విధంగా ఏర్పాట్లు చేశామని వివరించారు. ప్రయాణికుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ సరిహద్దు వరకు ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత తమ బాధ్యతగా చేపట్టామని స్పష్టం చేశారు.
త్వరలో బందర్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు టెండర్లు...
ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు కోసం డీపీఆర్ సిద్ధమైందని, త్వరలో టెండర్లను ఆహ్వానిస్తున్నామని మంత్రి వెల్లడించారు. దీని ద్వారా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.






