- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భువనగిరి కోట అభివృద్ధి పనుల్లో జాప్యం పై మంత్రి అసహనం.. అధికారులకు కీలక ఆదేశాలు
భువనగిరి కోట పర్యాటక అభివృద్ధి పనులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భువనగిరి కోట పర్యాటక అభివృద్ధి పనులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, పురావస్తు శాఖ డైరెక్టర్ డా. అర్జున్ రావులతో కలిసి చర్చించారు. భువనగిరి కోట దిగువ భాగంలో నిర్మిస్తున్న రోప్‌వే, హోటల్, పార్కింగ్ స్థలాలు, రెస్ట్‌రూమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, రాక్ గార్డెన్ విద్యుద్దీపాల అలంకరణ పనులను మంత్రి పరిశీలించారు.
అలాగే కొండపై కోట పునరుద్ధరణ, వాటర్ బాడీస్ బ్యూటిఫికేషన్, కేఫెటేరియా, ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్, మెట్ల పునరుద్ధరణ, ఎంట్రన్స్ ప్లాజా, టికెట్ కౌంటర్, వెయిటింగ్ లాంజ్, రెస్టారెంట్ తదితర పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు చేపడుతున్న కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో మాట్లాడిన మంత్రి, వివిధ విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల పురోగతిపై ఆరా తీశారు. పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందంటూ అసహనం వ్యక్తం చేశారు. భువనగిరి కోటకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొంటూ, అక్టోబర్ 2 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైతే పగలు, రాత్రి పనులు చేపట్టాలని సూచించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. గత ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేశాయని, కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని విమర్శించారు. కొత్త పర్యాటక విధానంతో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 2047 నాటికి తెలంగాణను అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక, వారసత్వ, సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. యాదాద్రి, భువనగిరి కోట, కొలనుపాక ప్రాంతాలను అనుసంధానిస్తూ సమగ్ర ఆధ్యాత్మిక–వారసత్వ పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. దేశ, విదేశీ పర్యాటకులకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
స్వదేశ్ దర్శన్ స్కీమ్–2.0 కింద రూ.56.81 కోట్ల అంచనా వ్యయంతో భువనగిరి కోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వివరించారు. వారసత్వ పరిరక్షణతో పాటు ఆధునిక సదుపాయాలు, రోప్‌వే ఏర్పాటు, పర్యాటక అనుభవాల మెరుగుదల ద్వారా పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి మద్దతు తెలపాలని కోరిన మంత్రి, ప్రతి కుటుంబం నెలకు కనీసం రెండు సార్లు పర్యాటక ప్రాంతాలను సందర్శించి తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. కుటుంబ సభ్యులతో కలిసి పర్యాటక ప్రాంతాలను సందర్శించడం ద్వారా మానసిక ఉల్లాసం పెరిగి, జీవన విధానంలో సానుకూల మార్పులు వస్తాయని అన్నారు.






