- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగుల సంక్షేమమే మా ప్రధమ ప్రాధాన్యత : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యోగుల సౌలభ్యం, సమానత్వం, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ శాఖ పరిధిలో బదిలీల ప్రక్రియను ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియను సంక్షేమ శాఖ పరిధిలో పూర్తిగా పారదర్శకంగా, నిష్పాక్షికంగా అమలు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో బుధవారం మంత్రి లక్ష్మణ్‌కుమార్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో టీజీఎస్ డబ్ల్యూ ఆర్ఈఐఎస్, టీజీటీడబ్ల్యూ ఆర్ఈఐఎస్, ఆశ్రమ పాఠశాలలు, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ, దివ్యాంగుల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుత దూర ప్రాంతాల్లో దీర్ఘకాలం చాలా కాలం పాటు సేవలందించిన ఉద్యోగులకు వారు కోరుకున్న ప్రాంతాల్లో పోస్టింగులు కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఆరోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులు, దంపతులు ఒకే చోట పనిచేసే స్పౌస్ కేసులు వంటి అంశాలను సానుకూలంగా పరిగణించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. దుర్భర పరిస్థితుల్లో విధులు నిర్వహించిన వారికి మానవీయ దృక్పథంతో న్యాయం చేయాలని , బదిలీలకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి వాటిని ఉద్యోగులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి దశలో డిజిటల్ పద్ధతులను వినియోగించి మానవ జోక్యం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వేగంగా స్పందించాలని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. ఎలాంటి ఒత్తిడి లేదా ఇతర వ్యక్తిగత ప్రభావాలు లేకుండా నిష్పాక్షికంగా ప్రక్రియ కొనసాగించాలని, గురుకుల సంస్థల్లో బోధన నాణ్యత దెబ్బతినకుండా అవసరమైన సిబ్బంది సమతుల్యతను కాపాడాలని ఆయన చెప్పారు. మహిళా ఉద్యోగులు, దివ్యాంగులు, సీనియర్ ఉద్యోగులకు ప్రత్యేక సౌలభ్యాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
గురుకులాల్లో అమలు చేసిన 370 జీవో కారణంగా ఉద్యోగులు ఎదుర్కొన్న ఇబ్బందులను అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 190 జీవో జారీ చేసినప్పటికీ అమలులో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ 190 జీవో అమలు సాధ్యాసాధ్యాలను సమగ్రంగా పరిశీలించి అమలు చేసేలా కృషి చేయాలని, ఉద్యోగులకు అన్యాయం జరగకుండా సమతుల్య నిర్ణయం తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ఉద్యోగులు మనశ్శాంతితో పనిచేసే వాతావరణం కల్పించడం ద్వారా బోధనలో నాణ్యత మరింత మెరుగవుతుందని, సంక్షేమ శాఖలో బదిలీల ప్రక్రియను ఆదర్శంగా నిలిచే విధంగా నిర్వహించాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి (ఎఫ్ఏసీ) సంతోష్, టీజీఎస్ డబ్ల్యూ ఆర్ఈఐఎస్ కార్యదర్శి (ఎఫ్ఏసీ) శారద, టీజీటీడబ్ల్యూ ఆర్ఈఐఎస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






