మన్ననూరు గురుకుల పాఠశాలలో మంత్రి అడ్లూరి ఆకస్మిక తనిఖీ

by Jakkula.Mamatha |

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు సాంఘిక సంక్షేమ గురుకుల(TG SWRS) బాలికల పాఠశాలను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ, దివ్యాంగులు, వృద్ధులు & ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు.

మన్ననూరు గురుకుల పాఠశాలలో మంత్రి అడ్లూరి ఆకస్మిక తనిఖీ
X

దిశ,అమ్రాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు సాంఘిక సంక్షేమ గురుకుల(TG SWRS) బాలికల పాఠశాలను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ, దివ్యాంగులు, వృద్ధులు & ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పాఠశాలలోని అన్ని తరగతి గదులు, వసతి గదులు, వంటశాల, భోజనశాల, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు, ఇతర మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పాఠశాలలో నూతన డైనింగ్ హాల్, ఆధునిక కిచెన్, సురక్షితమైన తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొని, వీటికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరితగతిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించిన మంత్రి, క్యాంపస్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పరిసరాల శుభ్రత కోసం అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పరిశుభ్రమైన వాతావరణం విద్యార్థినుల ఆరోగ్యానికి, విద్యాభ్యాసానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. మన్ననూరు అటవీ ప్రాంతంలో కోతుల సంచారం అధికంగా ఉండటంతో విద్యార్థినుల భద్రత దృష్ట్యా పాఠశాల ప్రహరీ గోడకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ను ఉద్దేశించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. 1985 నుంచి ఈ పాఠశాలలో చదివిన విద్యార్థినులు ప్రస్తుతం ఏయే ఉన్నత స్థానాల్లో ఉన్నారు, ఎంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఇతర రంగాల్లో స్థిరపడ్డారు అనే వివరాలతో సమగ్ర డేటాను పాఠశాలలో భద్రపరచాలని సూచించారు. ఆ సమాచారం ప్రస్తుత విద్యార్థినులకు స్ఫూర్తినిచ్చేలా ప్రదర్శించాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ విద్యార్థినులతో ఆత్మీయంగా మాట్లాడారు.

బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచిస్తూ, చదువుకుంటే మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని, డాక్టర్ అయితే డాక్టర్‌ను, ఇంజనీర్ అయితే ఇంజనీర్‌ను, పోలీస్ అధికారి అయితే పోలీస్ అధికారిని వివాహం చేసుకునే అవకాశం ఉంటుందని చమత్కారంగా వ్యాఖ్యానించగా విద్యార్థినులు చిరునవ్వులు చిందించారు. చదువే జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తి అని, ప్రతి ఒక్కరూ లక్ష్యంతో చదవాలని ఆయన ప్రోత్సహించారు.

విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలను దశలవారీగా కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Next Story