ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల దందా పై ఎంఈఓ ఆకస్మిక తనిఖీలు : దిశ ఎఫెక్ట్

by Batti.Sumithra |

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల విక్రయాల్లో అక్రమాలపై దిశ కథనానికి ఆర్మూర్ ఎంఈఓ పింజ రాజ గంగారం స్పందించారు.

ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల దందా పై ఎంఈఓ ఆకస్మిక తనిఖీలు : దిశ ఎఫెక్ట్
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల విక్రయాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, పాఠశాలలు సూచించిన పుస్తకాలనే తప్పనిసరిగా కొనుగోలు చేయాలని యాజమాన్యాలు తల్లిదండ్రుల పై ఒత్తిడి తెస్తున్నాయంటూ దిశ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ఆర్మూర్ మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) పింజ రాజ గంగారం స్పందించారు. శనివారం ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని విజయ్ పబ్లిక్ హై స్కూల్, నలంద హై స్కూల్, ఆల్ ఫోర్స్ హై స్కూల్, లిల్లీపుట్ పాఠశాలల్లో ఎంఈఓ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల దందా పై వచ్చిన వార్తా కథనాన్ని ఆధారంగా తీసుకుని ఆయా పాఠశాలలను పరిశీలించారు.

తనిఖీల సందర్భంగా వివిధ తరగతుల విద్యార్థులతో ఎంఈఓ నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఫీజుల చెల్లింపు రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను యాజమాన్య ప్రతినిధులను, విద్యార్థులను విడివిడిగా ప్రశ్నించి ఆరా తీశారు. విద్యార్థి సంఘాల నాయకులు, పలు పత్రికల్లో ప్రచురితమైన కథనాల ద్వారా ఈ అంశం పై సమాచారం అందిందని పేర్కొన్న ఎంఈఓ, విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తూ ఫీజులు బలవంతంగా వసూలు చేయవద్దని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలను హెచ్చరించారు. అలాగే, పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల విక్రయం నిర్వహిస్తే వాటి పై ఎలాంటి అదనపు మార్జిన్ లేదా లాభం లేకుండా, తాము కొనుగోలు చేసిన ధరలకే విద్యార్థులకు అందించాలని స్పష్టంగా ఆదేశించారు. ఈ తనిఖీల సందర్భంగా ఆయా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Next Story