ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మెగా జాబ్ మేళా : ఎమ్మెల్యే నాయిని

by Batti.Sumithra |

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తోందని, యువతకు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందించేందుకు పలు కార్యక్రమాలను చేపడుతోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మెగా జాబ్ మేళా : ఎమ్మెల్యే నాయిని
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తోందని, యువతకు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందించేందుకు పలు కార్యక్రమాలను చేపడుతోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగాల కోసం వచ్చిన యువతను ఉద్దేశించి మాట్లాడుతు రాష్ట్రప్రభుత్వం యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తున్నామని తెలిపారు. అర్హత, ప్రతిభ కలిగిన ప్రతి యువకుడు ఇలాంటి జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించడం అభినందనీయమన్నారు. ఉద్యోగాల కోసం వచ్చిన యువకులు, యువతులతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడి వారి విద్యార్హతలు, ఆసక్తులు, ఉద్యోగ అవకాశాల పై ఆరా తీశారు. అలాగే వివిధ ప్రైవేట్ రంగసంస్థల ప్రతినిధులతో సమావేశమై స్థానిక యువతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులతో సమావేశమైన ఎమ్మెల్యే కళాశాలలోని మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల పై సమీక్ష నిర్వహించారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన పనుల పై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని అధికారులను ఆదేశించారు. వాటిని సంబంధిత శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులు మంజూరు చేయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యాసంస్థల బలోపేతం, యువతకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. యువత ఉద్యోగాలు పొందడమే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యువనాయకులు విష్ణు రెడ్డి, ఆర్టీఏ మెంబర్ పల్లకొండ సతీష్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కళాశాల అధ్యాపకులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు.

Next Story