గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణం.. అత్యంత వేగవంతమైన మెట్రోగా మీరట్ మెట్రో

by Malleboina Mahesh |

మీరట్ మెట్రో సరికొత్త రికార్డు. గంటకు 120 కి.మీ వేగంతో దేశంలోనే ఫాస్టెస్ట్ మెట్రో! ఫిబ్రవరి 22న ప్రధాని మోడీ ప్రారంభించే అవకాశం.

గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణం.. అత్యంత వేగవంతమైన మెట్రోగా మీరట్ మెట్రో
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, మెట్రోలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ క్రమంలో దేశ రవాణా ముఖచిత్రాన్ని మార్చేస్తూ, మీరట్ మెట్రో త్వరలో అందుబాటులోకి రానుంది. ఇది గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి, భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో సర్వీస్‌గా నిలవబోతోంది. మీరట్ సౌత్ నుండి మోదీపురం మధ్య 21 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్‌లో మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి. ఈ పూర్తి దూరాన్ని అన్ని స్టేషన్లలో ఆగుతూ కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ వేగం ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో (110 కి.మీ) కంటే ఎక్కువగా ఉండటం విశేషం.

ఈ మెట్రో ప్రాజెక్టులో మరో కీలకమైన అంశం ఏమిటంటే, భారతదేశంలోనే మొదటిసారిగా ఒకే ట్రాక్, మౌలిక సదుపాయాలపై మెట్రో రైలు, 'నమో భారత్' (రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ - RRTS) రైళ్లు రెండూ నడవనున్నాయి. అంటే ప్రాంతీయ వేగవంతమైన రైళ్లతో పాటు నగర మెట్రో సేవలు కూడా సమన్వయంతో సాగుతాయి. దీనివల్ల ప్రయాణికులు ఒకే ప్లాట్‌ఫారమ్ నుండి అవసరాన్ని బట్టి వేర్వేరు సర్వీసులను ఉపయోగించుకునే వీలుంటుంది. ఇది దేశంలోనే మొదటి ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ మోడల్‌గా నిలవనుంది.

ఇందులో అధునాతన స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో, ఫ్లోరోసెంట్ గ్రీన్, నీలం రంగుల మిశ్రమం తో ఈ మెట్రో రైళ్లు ఆకర్షణీయంగా రూపొందాయి. ప్రతి రైలులో మూడు కోచ్‌లు ఉంటాయి, ఇవి 700 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలవు. ప్రయాణికుల భద్రత కోసం ప్రతి స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్ స్క్రీన్ డోర్లు (PSD), సీసీటీవీ కెమెరాలు, వీల్‌చైర్ల కోసం ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేశారు. ఈ మెట్రో సేవలను త్వరలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్‌లో మెట్రో సౌకర్యం ఉన్న ఐదో నగరంగా మీరట్ నిలవనుంది.

Next Story