- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడికుంట చెరువు.. వ్యర్థాల మయం!
పాల్వంచ పట్టణ నడిబొడ్డున ఉన్న మేడికుంట చెరువు నేడు అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ,పాల్వంచ: పాల్వంచ పట్టణ నడిబొడ్డున ఉన్న మేడికుంట చెరువు నేడు అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వర్షపు నీటిని నిల్వ చేసే ఈ చెరువు ప్రస్తుతం చెత్తాచెదారం, మురుగు నీరు, కలుపు మొక్కలు, ఆక్రమణలతో దయనీయ స్థితికి చేరుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చెరువు పరిసరాల్లో కొందరు ఆక్రమణదారులు ఒకవైపు మట్టిని పోసి స్థలాన్ని చదును చేస్తూ చెరువు విస్తీర్ణాన్ని క్రమంగా కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చెరువులో గణనీయమైన భాగం ఆక్రమణలకు గురైందని, సంబంధిత అధికారులు పట్టించుకోకపోతే భవిష్యత్తులో మేడికుంట చెరువు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు చెరువులో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగు నీటి కారణంగా తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమల ఉధృతి రోజురోజుకు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన ఈ పరిస్థితిని వెంటనే సరి చేయాలని కోరుతున్నారు. మేడికుంట చెరువు కేవలం నీటి వనరు మాత్రమే కాకుండా పట్టణ పర్యావరణ సమతుల్యతకు కీలకమైన ఆస్తి. ఇలాంటి చెరువులను పరిరక్షించడం ప్రభుత్వ శాఖల బాధ్యత అని ప్రజలు గుర్తు చేస్తున్నారు.
స్థానికుల ప్రధాన డిమాండ్లు..
చెరువులోని చెత్త, మురుగు, కలుపు మొక్కలను వెంటనే తొలగించాలి. చెరువు పూర్తి స్థాయి సర్వే నిర్వహించి అసలు హద్దులను గుర్తించాలి. ఆక్రమణలను గుర్తించి వెంటనే తొలగించాలి. మురుగు నీరు చెరువులోకి చేరకుండా శాశ్వత చర్యలు చేపట్టాలి. చెరువు అభివృద్ధి, సుందరీకరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. పట్టణ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా జిల్లా యంత్రాంగం, ఇరిగేషన్ శాఖ, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి మేడికుంట చెరువును ఆక్రమణల నుంచి రక్షించి, పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలకు ఈ చెరువు కేవలం జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






