- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు
తెలంగాణవ్యాప్తంగా వరుసగా రెండో రోజు నిలిచిపోయిన సబ్ రిజిస్ట్రార్ సేవలు.. సర్వర్ డౌన్‌తో స్లాట్లు బుక్ చేసుకున్న క్రయ, విక్రయదారుల తీవ్ర అవస్థలు!

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో (Sub-Registrar Offices) రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపాల కారణంగా గత రెండు రోజులుగా ప్రధాన సర్వర్లు పూర్తిగా మొరాయించడంతో భూములు, ఇళ్లు, ఆస్తుల బదలాయింపులు ఎక్కడికక్కడ స్తంభించిపోయినట్లు తెలుస్తోంది. ఫలితంగా అన్ని జిల్లాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. గత మూడు నెలల వ్యవధిలో ఇలా సాంకేతిక సమస్యల వల్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడం ఇది నాలుగోసారి కావడంతో ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సర్వర్లు పనిచేయకపోవడంతో కొత్తగా స్లాట్ బుకింగ్‌లు చేసుకోవడం, చలాన్ల చెల్లింపులు, ఈ-కేవైసీ (e-KYC) వంటి ఆన్‌లైన్ సేవలు పూర్తిగా నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో ముందస్తు ముహూర్తాలను చూసుకుని, వేలాది రూపాయలు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్న క్రయ, విక్రయ దారులు సాక్షులతో సహా కార్యాలయాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఈ సాంకేతిక సమస్యపై క్షేత్రస్థాయి అధికారులకు సైతం స్పష్టమైన సమాచారం లేకపోవడంతో వారు కూడా చేతులెత్తేస్తున్నారు. కాగా, సాఫ్ట్‌వేర్ లోడ్‌ను సరిచేసి, సర్వర్లను పునరుద్ధరించేందుకు రాష్ట్ర స్థాయి సాంకేతిక బృందం ముమ్మరంగా కసరత్తు చేస్తోందని ఉన్నతాధికారులు తెలుపుతుండగా.. పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.






