- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Medaram Jathara: మంత్రి సీతక్క ఆదేశాలతో రంగంలోకి వేలాది మంది సిబ్బంది
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, మహా జాతర నిర్వహణలో కీలకమైన పరిశుభ్రత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పంచాయతీ రాజ్ శాఖకు చెందిన వేల మంది సిబ్బందిని రంగంలోకి దింపారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాలోనే అతిపెద్దఆదివాసీ జాతరగా గుర్తింపు పొందిన సమ్మక్క - సారలమ్మ మహా జాతర–2026 సందర్భంగా కోట్లాది మంది భక్తులు మేడారానికి తరలిరానున్న నేపథ్యంలో, జాతర ప్రాంగణం, మేడారం గ్రామం, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, మహా జాతర నిర్వహణలో కీలకమైన పరిశుభ్రత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పంచాయతీ రాజ్ శాఖకు చెందిన వేల మంది సిబ్బందిని రంగంలోకి దింపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పరిశుభ్రమైన వాతావరణంలో జాతరను నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది.
బాధ్యతగా కాకుండా సేవగా భావించండి
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, “సమ్మక్క–సారలమ్మ మహా జాతర కోట్లాది భక్తుల విశ్వాసంతో ముడిపడిన మహోన్నత పర్వదినం. ఇలాంటి పవిత్రమైన జాతరలో పరిశుభ్రత, పారిశుధ్యం అత్యంత ముఖ్యమైన అంశం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పరిశుభ్రమైన మేడారాన్ని చూడాలనే ఉద్దేశంతో పంచాయతీ రాజ్ శాఖ సిబ్బందిని పూర్తిస్థాయిలో రంగంలోకి దింపుతున్నాం. ప్రతి అధికారి, సిబ్బంది దీనిని ఒక బాధ్యతగా కాకుండా సేవగా భావించి విధులు నిర్వర్తించాలి” అని పేర్కొన్నారు. మంత్రి ఆదేశాల మేరకు ఇతర జిల్లాల నుంచి అనుభవజ్ఞులైన డీపీవోలు, డీఎల్పీవోలు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులను జోనల్, సబ్‌జోనల్, సెక్టోరల్, సబ్‌సెక్టోరల్ అధికారులుగా నియమించారు. జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు పంచాయతీ రాజ్ సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లో నిరంతరం విధులు నిర్వహించనున్నారు.
రాత్రి 10 గంటల వరకు విధులు
పరిశుభ్రత నిర్వహణ కోసం జోనల్ నుంచి సబ్ సెక్టార్ స్థాయి వరకు వందల సంఖ్యలో అధికారులతో పాటు వేలాది మంది కార్మికులు పనిచేయనున్నారు. రెండు షిఫ్టుల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విధులు కొనసాగుతాయి. వీరితో పాటు బ్లీచింగ్, స్ప్రేయింగ్, వ్యర్థాల సేకరణ, మీట్ వేస్ట్ మేనేజ్‌మెంట్, డంప్ యార్డుల నిర్వహణ వంటి పనులకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. స్వీపింగ్ వాహనాలు, ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లు నిరంతరం అందుబాటులో ఉంచేలా ప్రత్యేక బృందాలను నియమించారు.
మేడారం జాతరను విజయవంతం చేయాలి
గద్దెలు, దేవాలయ ప్రాంగణం, ఎంట్రీ–ఎగ్జిట్ గేట్లు, క్యూ లైన్లు, హరిత హోటల్ ప్రాంతం, ఐటీడీఏ క్యాంపు, చిలుకల గుట్ట, పోలీస్ క్యాంపులు, జంపన్న వాగు పరిసరాలు, బస్టాండ్, వీఐపీ పార్కింగ్ ప్రాంతాలు సహా భక్తుల రాకపోకలు అధికంగా ఉండే అన్ని ప్రాంతాల్లో పంచాయతీ రాజ్ సిబ్బంది పారిశుద్య నిర్వహణ, ప్రత్యేక పరిశుభ్రత చర్యలు చేపట్టనున్నారు.అందు కోసం జోనల్ ఆఫీసర్లుగా 21 మంది డీపీఓలను, సబ్ జోనల్ ఆఫీసర్లుగా 42 మంది డీఎల్పీఓలను నియమించారు. అలాగే సెక్టార్ ఆఫీసర్లుగా 83 మంది ఎంపీఓలను, సబ్ సెక్టార్ ఆఫీసర్లుగా 480 మంది పంచాయతీ కార్యదర్శులకు బాద్యతలు అప్పగించారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఫీల్డ్ స్థాయిలో 9 వేల మంది కార్మికులను వినియోగిస్తున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైతే మరింత మంది సిబ్బందిని రంగంలోకి దించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. కోట్లాది మంది భక్తుల ఆరాధనతో, విశ్వాసంతో ముడిపడిన ఈ మహా జాతరలో ప్రత్యేక పరిశుభ్రత చర్యలు చేపట్టి మేడారం జాతరను విజయవంతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి సీతక్క ఈ సందర్భంగా పేర్కొన్నారు.






