మోటార్ మరమ్మతులకు వెళ్లి విద్యుత్ షాక్‌తో మెకానిక్ మృతి

by Ratna Kumari |

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామం కోటార్‌మూర్‌లో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది.

మోటార్ మరమ్మతులకు వెళ్లి విద్యుత్ షాక్‌తో మెకానిక్ మృతి
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామం కోటార్‌మూర్‌లో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ మోటార్‌కు మరమ్మతులు చేసేందుకు వెళ్లిన మెకానిక్ పన్నీరు శ్రీనివాస్ (46) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతానికి చెందిన పన్నీరు శ్రీనివాస్ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెర్కిట్‌కు చెందిన అల్లూరి నడిపి భూషణ్ రెడ్డి వ్యవసాయ పొలంలో విద్యుత్ మోటార్‌కు మరమ్మతులు చేసేందుకు వెళ్లిన ఆయన పనులు నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

ఘటనపై సమాచారం అందుకున్న ఆర్మూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యవసాయ పొలాల్లో మోటార్లకు మరమ్మతులు చేస్తూ జీవనోపాధి పొందుతున్న శ్రీనివాస్ అకాల మరణంతో పెర్కిట్, కోటార్‌మూర్ ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య అనురాధ, కుమార్తెలు శివాని, నికిత ఉన్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు స్థానికులను కలిచివేశాయి. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story