- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగర పరిశుభ్రతే లక్ష్యం.. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో మేయర్ సమీక్ష
నిజామాబాద్ నగరంలోని 11వ, 40వ డివిజన్లలో పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల మెరుగుదల లక్ష్యంగా శుక్రవారం నగర మేయర్ ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్‌తో కలిసి పర్యటించారు.

దిశ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలోని 11వ, 40వ డివిజన్లలో పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల మెరుగుదల లక్ష్యంగా శుక్రవారం నగర మేయర్ ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య పనులను వారు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. నగర ప్రజలకు అందుతున్న పౌరసేవల నాణ్యతను పరిశీలించారు. ఆయా డివిజన్లలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మేయర్ ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ పారిశుద్ధ్య సిబ్బందితో సమీక్షసమావేశం నిర్వహించారు. నగర వీధుల పరిశుభ్రత, చెత్త సేకరణ, పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు, ప్రజలకు అందుతున్న సేవల పై సమగ్రంగా సమీక్షించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితులను పరిశీలించిన మేయర్, ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన తాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ, మురుగునీటి పారుదల పరిస్థితులను కూడా పరిశీలించిన మేయర్, ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ కాలువల శుభ్రత పనులను వేగవంతం చేయాలని సూచించారు. రోడ్ల మరమ్మత్తు పనుల పురోగతిని సమీక్షించిన మేయర్, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేలా పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్యటనలో భాగంగా 11వ డివిజన్‌లోని జంతు వధశాలను కూడా మేయర్, కమిషనర్ సందర్శించారు. అక్కడి పారిశుద్ధ్య పరిస్థితులు, నిర్వహణ విధానం, పరిశుభ్రత ప్రమాణాల అమలును పరిశీలించి ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించిన అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరిశుభ్రత, ఆరోగ్య భద్రతా ప్రమాణాల విషయంలో ఎటువంటి రాజీ ఉండరాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మెరుగైన పౌరసేవల అందించడంలో నగర పాలక సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మేయర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్‌తో పాటు సంబంధిత డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.






