- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాళ్లపాయి మంగలిగుట్టలో భారీగా ఇసుక డంపింగ్.. రాత్రికి రాత్రే తరలింపు!
మండలంలోని తాళ్లపాయి పంచాయతీ మంగలిగుట్ట ప్రాంతంలో భారీ మొత్తంలో ఇసుక నిల్వలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

దిశ,ములకలపల్లి: మండలంలోని తాళ్లపాయి పంచాయతీ మంగలిగుట్ట ప్రాంతంలో భారీ మొత్తంలో ఇసుక నిల్వలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక తవ్వకం, నిల్వ, రవాణా కఠిన నిబంధనల ప్రకారం మాత్రమే జరగాల్సి ఉంది. కానీ ఇక్కడ మాత్రం వాగుల నుంచి మిషన్లతో తోడి ఒకేచోట భారీ స్థాయిలో డంపింగ్ చేయడంపై స్థానికంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం.. ఇసుక తవ్వకాలకు సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరిగా ఉండాలి.
ఇసుక నిల్వలకు సంబంధించిన స్టాక్ వివరాలు, అనుమతి పత్రాలు, రవాణా చలానాలు, ఎక్కడి నుంచి ఎంత ఇసుక తీసుకొచ్చారు, ఎక్కడికి ఎంత పంపించారు అనే రికార్డులు నిర్వహించాల్సి ఉండగా, ప్రతి లోడ్ అనుమతుల ప్రకారమే నడవాలి. అలాగే అక్రమ రవాణా జరగకుండా స్టాక్ యార్డ్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం భారీ స్థాయిలో కనిపిస్తున్న ఇసుక నిల్వలకు సంబంధించి ఎటువంటి నిబంధనలు లేవు. స్థానిక వాగుల నుంచి సుమారు 3 వేల క్యూబిక్ మీటర్లు పైనే ఇసుకను తోడినట్లు స్థానికులు చెబుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రే అక్రమంగా లారీలతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అనుమతుల్లేని అక్రమ నిల్వల వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇసుక నిల్వల మూలం, సంబంధిత అధికారుల పర్యవేక్షణ వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని స్థానిక రైతులు, ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై స్థానిక ఎమ్మార్వో స్వాతి బిందును వివరణ కోరగా.. మంగలిగుట్ట వద్ద ఇసుక నిల్వలపై సమాచారం అందిందని, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను సంఘటనా స్థలానికి పంపించి పూర్తి వివరాలు సేకరిస్తామని తెలిపారు. ఆర్‌ఐ నివేదిక వాస్తవాలను పరిశీలించి, నిబంధనల ఉల్లంఘిస్తే అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.






