- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో గర్జించిన హిందూ సమాజం.. బంగ్లాదేశ్ మైనారిటీల రక్షణ కోసం 25 నగరాల్లో భారీ ర్యాలీలు
బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా హిందూ మైనార్టీలపై దారుణమైన దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా హిందూ మైనార్టీలపై (Attacks on Hindu minorities) దారుణమైన దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో హిందువులనే లక్ష్యంగా చేసుకొని.. అతి క్రూరంగా హత్యచేసి రోడ్లపై ఊరేగించిన ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వాటికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై భారత్ సహా ఇతర దేశాలు సైతం తీవ్రంగా స్పందించాయి. అలాగే వివిధ దేశాల్లో ఉన్న హిందూ సంఘాలు సైతం బంగ్లాదేశ్ (Bangladesh) లోని మైనార్టీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలో హిందూ సమాజం మొత్తం ఏకం అయింది. బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై జరుగుతున్న హింస, దాడులు, మతపరమైన వేధింపులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా నిరసన చేపట్టారు.
ప్రస్తుతం అక్కడ అత్యంత కఠినమైన శీతాకాల వాతావరణం ఉన్నప్పటికీ.. ఏమాత్రం లెక్కచేయకుండా, అమెరికాలోని 25 ప్రధాన నగరాల్లో ప్రవాస భారతీయులు, స్వచ్ఛంద సంస్థలు, మానవ హక్కుల కార్యకర్తలు భారీ అవగాహన ర్యాలీలను నిర్వహించారు. 'గ్లోబల్ కోయలిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్' ('Global Coalition for Protection of Hindus in Bangladesh') పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం పూర్తిగా పార్టీ రహితంగా, మానవీయ కోణంలో సాగింది. న్యూయార్క్, వాషింగ్టన్, చికాగో వంటి నగరాల్లోని సిటీ హాళ్లు, సివిక్ సెంటర్ల వద్ద వేలాది మంది ప్రజలు గుమిగూడారు. మతపరమైన గుర్తింపు కారణంగా లక్ష్యంగా చేసుకుని ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరులకు సంఘీభావంగా మౌనం పాటించి, ప్రార్థనలు నిర్వహించారు.
ర్యాలీల ముఖ్య ఉద్దేశం..
అమెరికాలోని వివిధ మత పెద్దలు, కమ్యూనిటీ నాయకులు ఈ ర్యాలీల్లో పాల్గొని బంగ్లాదేశ్ మైనారిటీల రక్షణ (Protection of Bangladeshi minorities) కోసం గళమెత్తారు. అలాగే బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న బలహీన వర్గాలకు తక్షణ రక్షణ కల్పించాలని, అంతర్జాతీయ సమాజం ఈ దాడులపై స్పందించాలని శాంతియుతంగా విజ్ఞప్తి చేశారు. గడ్డకట్టే చలి (Freezing cold) ఉన్నప్పటికీ, వేలాది మంది స్వచ్ఛందంగా పాల్గొనడం ఈ సమస్య యొక్క తీవ్రతను చాటిచెప్పింది. ఈ ర్యాలీలు కేవలం నిరసనలు మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవతావాదుల అందరినీ ఏకం చేసే ఒక అవగాహన ప్రయత్నమని నిర్వాహకులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో శాంతి నెలకొనే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.
2025లోనే 116 మంది మృతి..
బంగ్లాదేశ్‌లో నెలకొన్న అల్లర్ల కారణంగా.. 2025 జూన్ నుండి జనవరి 2026 మధ్య కాలంలోనే 116 మంది హత్యకు గురైనట్లు HRCBM నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాణ నష్టంతో పాటు వందలాది దేవాలయాల ధ్వంసం, ఇళ్లు, వ్యాపార సంస్థల లూటీలు నిరంతరాయంగా కొనసాగుతుండటంపై ఐక్యరాజ్యసమితి తో సహా పలు అంతర్జాతీయ సంస్థలు (International organizations) ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా అక్కడి మైనారిటీ వర్గాలు ఇవి మతపరమైన దాడులని వాదిస్తుండగా, ప్రభుత్వం మాత్రం వీటిని రాజకీయ కారణాల వల్ల జరిగిన ఘటనలుగా పేర్కొంటోంటుంది.






