డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు

by Batti.Sumithra |

షాద్‌నగర్ మున్సిపాలిటీలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని, రాజకీయ సిఫార్సులతో అసలైన లబ్ధిదారులకు కాకుండా ఇతరులకు డబుల్ బెడ్ రూమ్ లను కేటాయింపులు చేశారని షాద్‌నగర్ నియోజకవర్గం సీపీఐ కన్వీనర్ పానుగంటి పర్వతాలు ఆరోపించారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు
X

దిశ, షాద్ నగర్ : షాద్‌నగర్ మున్సిపాలిటీలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని, రాజకీయ సిఫార్సులతో అసలైన లబ్ధిదారులకు కాకుండా ఇతరులకు డబుల్ బెడ్ రూమ్ లను కేటాయింపులు చేశారని షాద్‌నగర్ నియోజకవర్గం సీపీఐ కన్వీనర్ పానుగంటి పర్వతాలు ఆరోపించారు. అర్హులైన నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు షాద్‌నగర్ నియోజకవర్గ కన్వీనర్ పానుగంటి పర్వతాలు ఆధ్వర్యంలో బుధవారం షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా పర్వతాలు మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల పై ఉన్నత స్థాయి కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని, అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపికలో కిరాయి ఇళ్లలో ఉంటూ కూలీ పనులు చేసుకునే పేదలకు, భర్తను కోల్పోయిన వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి నిరుపేదలకు న్యాయం చేయాలని కోరారు. అధికార పార్టీ దళారులు ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్ట వేసి అర్హులకు పథకాలు అందకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఆమోదయోగ్యం కాని ఇళ్లు నిర్మించిందని, ప్రస్తుత ప్రభుత్వం అర్హులను కాకుండా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారిని ఎంపిక చేసిందని పర్వతాలు విమర్శించారు. అనంతరం షాద్ నగర్ ఆర్డీఓ ఎన్.ఆర్. సరితకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్నా కార్యక్రమంలో సీపీఐ నాయకులు బుద్ధుల జంగయ్య, జిల్లేడు చౌదరిగుడా మండల కార్యదర్శి జి. వెంకటేష్, కొత్తూరు మండల కార్యదర్శి ఎం.డీ.షకిల్, ఫరూక్ నగర్ మండల సహాయ కార్యదర్శి గోవింద్ నాయక్, మన్సూర్, ఎల్లయ్య, మైసయ్య, యాదగిరి, షబ్బీర్, యాదయ్య, నియోజకవర్గంలోని సీపీఐ కార్యకర్తలు, డబుల్ బెడ్‌రూం ఇళ్ల బాధితులు పాల్గొన్నారు.

Next Story