- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయబరేలీ ఆసుపత్రిలో అమానుషం.. పేషెంట్‌ను కాలితో తన్నిన మహిళా సిబ్బంది సస్పెండ్ (వీడియో)
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఓ రోగి పట్ల ఆసుపత్రి సిబ్బంది అత్యంత అమానుషంగా ప్రవర్తించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఓ రోగి పట్ల ఆసుపత్రి సిబ్బంది అత్యంత అమానుషంగా ప్రవర్తించింది. మానసిక సమస్యలతో బాధపడుతూ నేలపై పడి ఉన్న ఓ వ్యక్తిని మహిళా సిబ్బంది విచక్షణారహితంగా కాలితో తన్నుతూ, అసభ్య పదజాలంతో దూషించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించి ఆమెపై వేటు వేశారు. జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ జిల్లా ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం 35 సెకన్ల నిడివి ఉన్న వైరల్ వీడియోలో సదరు మహిళ, రోగిని పదిసార్లు కాలితో తన్నడం, ముఖంపై దాడి చేయడం స్పష్టంగా రికార్డైంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘ఇంత అహంకారం ఎందుకు? సాటి మనిషిని మనిషిగా చూడలేని తెల్లబట్టలు ఎందుకు?’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల చర్యలు..
సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు, యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఆదేశాల మేరకు ఆసుపత్రి యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టింది. దాడికి పాల్పడిన మహిళను ఆసుపత్రికి చెందిన స్వీపర్ ‘పింకీ’గా గుర్తించి, ఆమెను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆమెను ఆయుష్ ఓపీడీ విభాగానికి అటాచ్ చేశారు. ఈ అమానుష ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన (డాక్టర్ దినేష్ ప్రతాప్ సరోజ్, డాక్టర్ రిచా, సుష్మా యాదవ్) విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. 1956 ఎంప్లాయీ కాండక్ట్ రూల్స్ ఉల్లంఘన కింద ఆమెపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించారు. రోగుల పట్ల ఇలాంటి అమానుష ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, సేవా నియమావళిని కచ్చితంగా పాటించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్యాధికారులకు వైద్యారోగ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి కఠిన హెచ్చరికలు జారీ చేశారు.






