గూడూరు మండలంలో చిరుతపులి సంచారం కలకలం

by Ratna Kumari |

గూడూరు మండలంలోని మర్రిమిట్ట శివారులో చిరుతపులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

గూడూరు మండలంలో చిరుతపులి సంచారం కలకలం
X

దిశ, గూడూరు : గూడూరు మండలంలోని మర్రిమిట్ట శివారులో చిరుతపులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మండల ప్రజలు, ముఖ్యంగా అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గూడూరు రేంజ్ అటవీశాఖ అధికారి ప్రసాదరావు సూచించారు. మంగళవారం రాత్రి మర్రిమిట్ట శివారులోని తోట దస్రు తండా సమీపంలోని మామిడి తోట వైపు చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సమయం కావడంతో స్పష్టమైన ఆనవాళ్లు లభించకపోవడంతో అధికారులు గ్రామంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. బుధవారం ఉదయం గ్రామస్థులు, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కలిసి అనుమానిత ప్రాంతమైన మామిడి తోటతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అయితే రాత్రి, తెల్లవారుజామున కురిసిన వర్షం కారణంగా ఎలాంటి పాదముద్రలు లేదా ఇతర ఆనవాళ్లు గుర్తించలేకపోయామని అటవీశాఖ అధికారి ప్రసాదరావు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడిన ఆయన, చిరుతపులికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించినా లేదా సంచారం గుర్తించినా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జంతువుకు ఎలాంటి హాని తలపెట్టే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేవారు, అడవికి సమీప ప్రాంతాల్లో పశువులను మేపేవారు ప్రత్యేక అప్రమత్తతతో వ్యవహరించాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.

Next Story