భల్లాల దేవునికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి.. సీఎం వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

by Prasad Jukanti |

తెలంగాణ దివాలా తీసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

భల్లాల దేవునికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి.. సీఎం వ్యాఖ్యలకు  కేటీఆర్ కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి భావ దారిద్య్రంతో మాట్లాడుతున్నారని ఎంత దివాలాకోరు మనిషైనా నేను దివాలా తీశాను అని చెప్పి మెడలో బోర్డు వేసుకొని తిరడని, కానీ రేవంత్ రెడ్డి ప్రతిసారి తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్ముతూనే ఉన్నాడని మండిపడ్డారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం గురించి ఇంత నీచంగా మాట్లాడే ముఖ్యమంత్రి దేశంలో ఎవరూ లేరన్నారు. ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి మరి 72 సార్లు ఎందుకు ఢిల్లీకి వెళ్ళాడో చెప్పాలన్నారు.

అక్కడికక్కడే రాజీనామా చేస్తా:

తెలంగాణ వ్యక్తిని చూసి కాదు, రేవంత్ రెడ్డిని చూసి అసహ్యించుకుంటున్నారని తమ హాయంలో కేంద్రం సహకరించకున్నా అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యాలు, రైతన్నల దుస్థితి, వ్యవసాయ సంక్షోభం, ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రంలో ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి స్వయంగా సమయం, స్థలం నిర్ణయించి చెబితే చర్చకు వస్తానన్నారు. నిజంగానే రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించడంలో తాను విఫలమైతే అక్కడికక్కడే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. సీఎం, అయన కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల దోపీడి వల్లనే తెలంగాణ దివాళ తీస్తోందని ధ్వజమెత్తారు.

రేవంత్‍ను చూస్తే అనుమానం వస్తోంది:

బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ అప్పులు కేవలం రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మాత్రమే అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. రేవంత్ రెడ్డి కేవలం ఒక్క రాష్ట్ర రైతాంగానికే లక్ష 13 వేల కోట్ల రూపాయల కోట్లు ఎగగొట్టారని ఈరోజు సిగ్గులేకుండా రాష్ట్రంలోని రైతాంగం గురించి వారేదో సంతోషంలో ఉన్నారు అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడని విమర్శించారు. రాష్ట్రంలోని రైతాంగానికి, విద్యార్థులకు, మహిళలకు, రిటైర్డ్ ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇలా ఎవరికీ డబ్బులు లేవు కానీ రాహుల్ గాంధీకి మాత్రం వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానంటూ రేవంత్ చెప్తున్న తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని, ఆయనకు మానసిక జబ్బు ఉందేమో అన్న అనుమానం వస్తోందన్నారు.

అర్ధరాత్రి దొంగచాటుగా పూజలు దేనికి?:

ఒకవైపు డబ్బులు లేవు అనుకుంటూనే, 200 కోట్ల రూపాయలతో తన సొంత ఇష్టాల మేరకు ఒక రాజభవనం నిర్మించుకుంటున్నారని దానికి ఆయన సతీమణితో అర్ధరాత్రి పూజలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయకుంటే ఎందుకు అర్ధరాత్రి దొంగ చాటుగా పూజలు నిర్వహించారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ప్రతి రంగం అగ్రస్థానం వైపు పయనిస్తే రేవంత్ రెడ్డి పాలనలో మాత్రం పాతాళానికి పడిపోతుందని అన్నారు. నిజంగానే రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని, మద్యం అమ్మకాలను నిషేధించాలని కేటీఆర్ సవాలు విసిరారు.

బాహుబలిలో భల్లాలకు పట్టిన గతే మీకు:

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి పాలన పైన కోపంగా ఉన్నారని, అన్ని గమనిస్తున్నారని, చివరికి రానున్న రోజుల్లో బాహుబలి సినిమాలో భల్లాల దేవునికి పట్టిన గతే పడుతుందని అన్నారు. తాను నమ్మిన హిట్లర్ కి ఎలాంటి ముగింపు కలిగిందో అలాంటి ముగింపే ప్రజలు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితానికి ఇస్తారని కేటీఆర్ అన్నారు. కేవలం కెసిఆర్ తో కూర్చుండి చర్చ చేస్తే తన స్థాయి పెరుగుతుందన్న ఒక ఐడెంటిటీ క్రైసిస్ రేవంత్ రెడ్డిలో ఉన్నదని, అందుకే ప్రతిసారి రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి మాట్లాడుతూ తన స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Next Story