మధ్యాహ్న భోజన మెనూ తప్పనిసరిగా అమలు జరగాలి

by Taduka Kalyani |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాధికారి డి. వాసంతి, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్‌తో కలిసి మంగళవారం కొత్తగూడెం, చుంచుపల్లి మండలాల్లోని పలు పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు.

మధ్యాహ్న భోజన మెనూ తప్పనిసరిగా అమలు జరగాలి
X

దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాధికారి డి. వాసంతి, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్‌తో కలిసి మంగళవారం కొత్తగూడెం, చుంచుపల్లి మండలాల్లోని పలు పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. రైటర్ బస్తిలోని ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన ఆమె, విద్యార్థుల హాజరు తక్కువగా ఉండటాన్ని గమనించి నమోదు సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో మమేకమై స్వయంగా పాఠాలు బోధించి, సంయుక్త అక్షరాలను నేర్పించారు. కొత్తగూడెం భవిత కేంద్రాన్ని సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించిన జిల్లా విద్యాధికారి సంతృప్తి వ్యక్తం చేశారు. చుంచుపల్లి భవిత కేంద్రంలో విద్యార్థుల హాజరు తక్కువగా ఉండటాన్ని గమనించి, అందరూ క్రమం తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అందజేసిన టీఎల్‌ఎం (టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్) సామగ్రిని తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించారు. బాబు క్యాంపు ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాబు క్యాంపులో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసి, ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, ప్రతి విద్యార్థికి వారానికి మూడు గుడ్లు అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Next Story