రెండు చెరువుల నడుమ ‘కాసా గ్రాండ్ సియెర్రా’ సిత్రాలు

by Ratna Kumari |

రియల్ ఎస్టేట్ దిగ్గజం అని చెప్పుకునే 'కాసా గ్రాండ్' హైదరాబాద్ దుండిగల్ పరిధిలో చేపట్టిన ‘సియెర్రా’ విల్లా ప్రాజెక్ట్ చుట్టూ చట్టపరమైన వివాదాలు చుట్టుముడుతున్నాయి.

రెండు చెరువుల నడుమ ‘కాసా గ్రాండ్ సియెర్రా’ సిత్రాలు
X

దిశ, మేడ్చల్ బ్యూరో : రియల్ ఎస్టేట్ దిగ్గజం అని చెప్పుకునే 'కాసా గ్రాండ్' హైదరాబాద్ దుండిగల్ పరిధిలో చేపట్టిన ‘సియెర్రా’ విల్లా ప్రాజెక్ట్ చుట్టూ చట్టపరమైన వివాదాలు చుట్టుముడుతున్నాయి. వందల కోట్ల రూపాయల ప్రీ-లాంచ్ బిజినెస్ వెనుక పర్యావరణ విధ్వంసం, చట్టాల ఉల్లంఘనలు దాగి ఉన్నాయని క్షేత్రస్థాయి పరిశోధనలో ఇప్పటికే స్పష్టమైంది. రెండు వైపులా చారిత్రాత్మక నీటి వనరులను నలిపేస్తూ, నిబంధనలను తుంగలో తొక్కి సాగుతున్న ఈ అక్రమ సామ్రాజ్యంపై పలు రకాలుగా ఆరోపణలు తలెత్తుతున్నాయి.

కోతినారు చెరువు కట్టపై బుంగలు.. సరి చేస్తారంట..

కోతినారు చెరువు పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించడమే కాకుండా, చెరువు ఉనికికి ఆధారమైన కట్టను ధ్వంసం చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ తరలిస్తున్నట్లు తహశీల్దార్ ఎన్. రాజేశ్వర్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలనలో స్వయంగా గుర్తించారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తూ, పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు గానూ రెవెన్యూ అధికారుల అధికారిక ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కాసా గ్రాండ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. నిందితులపై బీఎన్ఎస్ సెక్షన్లు మరియు ప్రభుత్వ ఆస్తుల నష్ట నివారణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులు ఒత్తిడి తెచ్చి అక్రమ మట్టిని, కట్టడాలను తొలగింపజేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇంకా ఆక్రమణల మరకలు అలాగే ఉన్నాయి. పైకి సరి చేస్తున్న అది ఎంతవరకు జరుగుతుందనేది ప్రశ్నగానే ఉన్నది.

దుండిగల్ పెద్ద చెరువు కో-ఆర్డినేట్స్ కబ్జా..

ఈ వివాదాస్పద వెంచర్‌లో కేవలం కోతినారు చెరువే కాదు.. లేఔట్ వెనుక భాగంలో ఉన్న దుండిగల్ పెద్ద చెరువు బఫర్ జోన్‌ను సైతం ఈ సంస్థ వదల్లేదు. హెచ్‌ఎండీఏ లేక్స్ అధికారిక మ్యాప్ రికార్డులను పరిశీలిస్తే, కో-ఆర్డినేట్స్ A 32 నుండి A 36 మధ్య ఈ అక్రమ చొరబాటు జరిగినట్లు సాటిలైట్ డిజిటల్ మ్యాపింగ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. చెరువు పరిధిలోకి లేఔట్ ఎమినిటీస్ భాగంతో పాటు 3 నుండి 4 లగ్జరీ విల్లాలు చొరబడేలా ప్లాన్ చేశారు. రెండు చెరువుల బఫర్ జోన్లను మింగేస్తూ లగ్జరీ వెంచర్ వేయడం పర్యావరణ ప్రేమికులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ విషయంపై ఇరిగేసినేయి రవిని వివరణ కోరెందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.

రోడ్డు విస్తరణను దాచిపెడుతున్నారా..?

హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ వెంచర్ సమీపంలో 30 మీటర్ల (సుమారు 100 అడుగులు) రహదారి విస్తరణ జరగాల్సి ఉంది. ప్రస్తుతం కాసా గ్రాండ్ లేఔట్ వద్ద చెరువు కట్ట దిగువున కేవలం 9 మీటర్ల బఫర్ జోన్ మాత్రమే చూపిస్తున్నారు. రేపు ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరణ చేపడితే, ఆ రోడ్డు ఖచ్చితంగా కాసా గ్రాండ్ లేఔట్ ఫ్రంటేజ్‌ను చీల్చుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం కస్టమర్లను బురిడీ కొట్టించడానికి ఎంట్రన్స్‌లో చూపిస్తున్న పెద్ద పార్కు, అందమైన గ్రీనరీ జోన్, మరియు క్లబ్‌హౌస్ లోని కొంత భాగం రోడ్డు విస్తరణలో కొట్టుకుపోవడం ఖాయం. కోట్లు పెట్టి విల్లాలు కొనే కొనుగోలుదారులకు ఈ రోడ్డు విస్తరణ ముప్పును దాచిపెట్టి వ్యాపారం సాగిస్తున్నారు.

56 పేజీల కలర్ బ్రోషర్.. కానీ ‘రేరా’ శూన్యం..

రియల్ ఎస్టేట్ చట్టాల ప్రకారం ఏ ప్రాజెక్టునైనా మార్కెటింగ్ చేయాలన్నా లేదా ప్రకటనలు ఇవ్వాలన్నా ‘రేరా’ అప్రూవల్ నెంబర్ తప్పనిసరి. కానీ కాసా గ్రాండ్ మార్కెట్లోకి వదిలిన 56 పేజీల అత్యంత విలాసవంతమైన కలర్ బ్రోషర్‌లో ఎక్కడా రిజిస్ట్రేషన్ నెంబర్ ఊసే లేదు. దీనిపై సంస్థ ప్రతినిధుల సమాధానాలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. సేల్స్ విభాగం సాంకేతిక కారణాల వల్ల అప్లికేషన్ లేట్ అయిందని అబద్ధాలు చెప్తుంటే, లీగల్ విభాగం మాత్రం తమ ప్రాజెక్టుకు అసలు రేరా పర్మిషనే అవసరం లేదు అంటూ చట్టాన్ని పరిహసిస్తోంది. రేరా నెంబర్ లేకుండా వందల కోట్ల బుకింగ్స్ వసూలు చేయడం చట్టప్రకారం నేరమనే విషయం అందరికీ తెలిసిందే.

అన్నీ సరిగా ఉంటే చూపించడానికి ఏమైంది..?

నిబంధనల ప్రకారం ప్రతి వెంచర్ ఆఫీసులో ఇరిగేషన్ ఎన్ఓసీలు, రెవెన్యూ క్లియరెన్స్ పత్రాలు, అప్రూవ్డ్ లేఔట్ కాపీలు కస్టమర్ల పరిశీలన కోసం అందుబాటులో ఉంచాలి. కానీ కాసా గ్రాండ్ ఆఫీసులో ఇవేవీ ప్రదర్శించడం లేదు. దీనిపై మీడియా ప్రతినిధులు వివరణ కోరగా.. మొదట "మెయిల్ చేస్తాం, వాట్సప్ చేస్తాం" అని దాటవేసిన లీగల్ టీం, ఆ తర్వాత "కంపెనీ అంతర్గత పత్రాలు బయటవాళ్లకు ఎందుకు చూపిస్తాం" అంటూ మాట మార్చడం, ఫోన్లు ఎత్తకపోవడం గమనార్హం. పత్రాలు అన్నీ సక్రమంగా ఉంటే మీడియాకు, కొనుగోలుదారులకు చూపించడానికి భయం ఎందుకు?

'హైడ్రా' తక్షణమే రంగంలోకి దిగాలి..

రెండు చెరువుల ఉనికిని మ్యాప్ నుంచే తుడిచేసేలా సాగుతున్న కాసా గ్రాండ్ ‘సియెర్రా’ అక్రమాలపై హైడ్రా , హెచ్‌ఎండీఏ, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో అమాయక కస్టమర్లు మోసపోకుండా ఉండాలంటే వెంటనే క్షేత్రస్థాయిలో సర్వే జరిపి, 30 మీటర్ల మాస్టర్ ప్లాన్ రోడ్డు , చెరువుల బఫర్ జోన్ సరిహద్దులను మార్కింగ్ చేయాలి. ఆ రోడ్డు సరిహద్దు వదిలిపెట్టిన తర్వాతే నిర్మాణాలకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలకు కొమ్ముకాస్తున్న అధికారులపై కూడా విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story