IndiGo: బడ్జెట్ ప్రయాణికులకు ఇండిగో కొత్త ఆఫర్

by S Gopi |   (  Updated:2026-07-01 13:29:43  IST  )

'ప్రయాణికులు తాము ఉపయోగించుకునే సేవలకు మాత్రమే డబ్బులు చెల్లించాలి' అనే కాన్సెప్ట్‌తో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చారు.

IndiGo: బడ్జెట్ ప్రయాణికులకు ఇండిగో కొత్త ఆఫర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: చిన్న క్యాబిన్ బ్యాగ్ (హ్యాండ్ లగేజ్)తో మాత్రమే ప్రయాణించే ఎకానమీ క్లాస్ ప్యాసింజర్లకు దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో గుడ్ న్యూస్ చెప్పింది. చెక్-ఇన్ బ్యాగేజీ (పెద్ద లగేజ్ బ్యాగులు) అవసరం లేని వారి కోసం 'ఇండిగో లైట్' పేరుతో సరికొత్త ఎంట్రీ-లెవల్ ఛార్జీని బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. 'ప్రయాణికులు తాము ఉపయోగించుకునే సేవలకు మాత్రమే డబ్బులు చెల్లించాలి' అనే కాన్సెప్ట్‌తో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చారు. దీనివల్ల లగేజీ లేని వారికి టికెట్ ధరలు మరింత తగ్గుతాయి. జూలై 15 నుంచి ప్రారంభమయ్యే ప్రయాణాల కోసం, జూలై 1 నుండే ఇండిగో అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా వారి కాంటాక్ట్ సెంటర్ ద్వారా ఈ 'లైట్' టికెట్లను బుక్ చేసుకోవచ్చు. పెద్దలు, పిల్లలు ఇద్దరికీ వర్తించే ఈ ఆఫర్.. వన్-వే, రౌండ్-ట్రిప్, మల్టీసిటీ వంటి అన్ని నాన్-స్టాప్ దేశీయ, అంతర్జాతీయ రూట్లలో అందుబాటులో ఉంటుంది.

విమానంలో ఇచ్చే ఉచిత భోజనం వద్దనుకునే ప్రయాణికుల కోసం గత నెలలోనే ఎయిర్ ఇండియా దేశీయ విమానాల్లో రూ. 300 నుంచి రూ. 700 వరకు తక్కువ ధరతో కూడిన "బేసిక్' ఛార్జీని ప్రవేశపెట్టింది. అయితే ఎయిర్ ఇండియా బేసిక్ టికెట్‌లో 15 కేజీల చెక్డ్ బ్యాగేజీ, 7 కేజీల క్యాబిన్ బ్యాగేజీతో పాటు ఉచితంగా టీ లేదా కాఫీ ఇస్తుండగా.. ఇండిగో మాత్రం కేవలం క్యాబిన్ బ్యాగేజీ మాత్రమే ఉన్నవారిని టార్గెట్ చేస్తూ ఈ కొత్త తరహా సేవలు ప్రారంభించింది. ఇటీవల బడ్జెట్ ప్రయాణికులను ఆకర్షించే లక్ష్యంతో విమానయాన రంగంలో పోటీ పెరుగుతోంది.

Next Story