కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు కార్మికులు సజీవ దహనం

by Malleboina Mahesh |

రాజస్థాన్‌లోని భివాడిలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక రసాయన కర్మాగారంలో మంటలు చెలరేగడంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు కార్మికులు సజీవ దహనం
X

దిశ, వెబ్ డెస్క్: కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరికొంత మందికి గాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన రాజస్థాన్‌లోని ఖైర్తాల్-తిజారా జిల్లా భివాడి పారిశ్రామిక ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం స్థానికంగా రసాయన కర్మాగారంలో (Chemical Factory) ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు క్షణాల్లో ఫ్యాక్టరీ అంతటా వ్యాపించడంతో లోపల పనిచేస్తున్న కార్మికులు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ భయంకరమైన ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది భారీ యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మంటలను అదుపు చేసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఇప్పటివరకు ఏడుగురి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా, రసాయనాలు నిల్వ ఉంచిన చోట ఏదైనా పొరపాటు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉండగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story