అయోధ్య యజ్ఞశాలలో భారీ అగ్నిప్రమాదం

by Malleboina Mahesh |

"అయోధ్య యజ్ఞశాలలో భారీ అగ్నిప్రమాదం; తృటిలో తప్పిన ప్రాణనష్టం. నిర్వహణ లోపాలు, నిధుల వినియోగంపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు - విచారణకు డిమాండ్."

అయోధ్య యజ్ఞశాలలో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలో ఏర్పాటు చేసిన మహా యజ్ఞ శాల (Mahayagnashala)లో భారీ అగ్నిప్రమాదం (Massive fire) చోటు చేసుకుంది. సరయూ నది తీరాన జమ్తారా ఘాట్ వద్ద నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యజ్ఞం ముగిసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. యజ్ఞశాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వెదురు, గడ్డి తో నిర్మించిన పండల్ క్షణాల్లో బూడిదయింది. ప్రమాద సమయంలో యూపీ రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ సహా పలువురు ఉన్నతాధికారులు అక్కడే ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఆరు అగ్నిమాపక యంత్రాలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, యజ్ఞగుండంలోని నిప్పురవ్వలు ఎగిసి పడటం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

అయితే, ఈ ఘటనపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యజ్ఞ నిర్వహణలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని, నిపుణుల పర్యవేక్షణ లేకుండానే ఇంతటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించారని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా, యజ్ఞం పేరుతో మంత్రికి సంబంధించిన విభాగాన్ని ఉపయోగించుకుని నిధుల సేకరణ జరిగిందని, కేవలం ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో భద్రతా ఏర్పాట్లను గాలికొదిలేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ భారీ కార్యక్రమం వెనుక ఉన్న ఆర్థిక వనరులు, మానవ వనరుల వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.

Next Story