అర్ధరాత్రి ఇంటి నుంచి వివాహిత అదృశ్యం.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు

by Jakkula.Mamatha |

హఫీజ్‌బాబా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది.

అర్ధరాత్రి ఇంటి నుంచి వివాహిత అదృశ్యం.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు
X

దిశ, చంపాపేట్: హఫీజ్‌బాబా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒమర్ కాలనీకి చెందిన సతీష్ మానే 2025లో వైష్ణవి జాధవ్(22)ను వివాహం చేసుకున్నాడు. అనారోగ్య కారణాలతో గత మూడు నెలలుగా వైష్ణవి తన తల్లి ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతోంది. ఈ నెల 7న తల్లితో కలిసి భర్త ఇంటికి తిరిగి వచ్చింది. అయితే తిరిగి తల్లి ఇంటికి వెళ్లాలని కోరగా కుటుంబ సభ్యులు ఆమెను ఇంట్లోనే ఉండేలా ఒప్పించారు.

ఈ నేపథ్యంలో జులై 14 తెల్లవారుజామున సుమారు ఒంటి గంట సమయంలో కుటుంబ సభ్యులకు చెప్పకుండా వైష్ణవి ఇంటి నుంచి వెళ్లిపోయింది. బంధువులు, పరిసర ప్రాంతాలు, పరిచయస్తుల వద్ద విస్తృతంగా వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో భర్త హఫీజ్‌బాబా నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదుదారుడి వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు, ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసును ఎస్‌ఐ ఎన్. నాగలక్ష్మి దర్యాప్తు చేస్తున్నారు.

అదృశ్యమైన మహిళ వివరాలు..

వైష్ణవి జాధవ్, వయస్సు 22 సంవత్సరాలు, ఎత్తు సుమారు 4.5 అడుగులు, గోధుమ వర్ణం, నల్లటి జుట్టు, నల్లటి కళ్లు కలిగి ఉంది. ఇంటి నుంచి వెళ్లే సమయంలో ఆకుపచ్చ రంగు పంజాబీ డ్రెస్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు వెంటనే హఫీజ్‌బాబా నగర్ పోలీస్ స్టేషన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Next Story