పెళ్లి మోసం కేసు.. హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి

by Malleboina Mahesh |

హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి! రూ. 9 కోట్ల మోసం ఆరోపణలపై స్టే కోరుతూ పిటిషన్. తనపై వివరణ లేకుండా కేసు పెట్టారని ధ్వజమెత్తు.

పెళ్లి మోసం కేసు.. హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అషురెడ్డి (Ashureddy) తనపై నమోదైన క్రిమినల్ కేసును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. లండన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వై.వి. ధర్మేంద్ర ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు ఆమెపై, ఆమె కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసు (cheating case) నమోదు చేసిన విషయం తెలిసిందే. తనపై ధర్మేంద్ర (Dharmendra) చేసిన ఆరోపణలకు సంబంధించి పోలీసులు కనీస వివరణ అడగకుండానే ఏకపక్షంగా కేసు నమోదు చేశారని అషురెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, కాబట్టి ఈ కేసును వెంటనే కొట్టివేయాలని (Quash) ఆమె తన పిటిషన్‌లో కోరారు. అలాగే అసలు వాస్తవాలను దాచిపెట్టి, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్మేంద్ర చేసిన ఆరోపణలు ఇవే..

ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2018 నుండి అషురెడ్డితో ధర్మేంద్రకు పరిచయం ఉంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె సుమారు రూ. 9.35 కోట్లు నగదుతో పాటు 5 కేజీల బంగారం, విలాసవంతమైన కార్లు, ప్లాట్లు వసూలు చేసిందని ఆయన ఆరోపించారు. పెళ్లి విషయంపై నిలదీస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడమే కాకుండా, తనపై తప్పుడు కేసులు పెడతానని భయపెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉండగా, అషురెడ్డి హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Next Story