- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏక్షణంలో ఏం జరుగుతుందో.. శిథిలావస్థలో మర్పల్లి తహశీల్దార్ కార్యాలయం
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ భవనం ఎప్పుడు కూలుతుందో నన్న భయాందోళనల మధ్య ఉద్యోగులు కాలం వెళ్లదీస్తున్నారు.

దిశ, మర్పల్లి : మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ భవనం ఎప్పుడు కూలుతుందో నన్న భయాందోళనల మధ్య ఉద్యోగులు కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల శనివారం నాడు మండల కేంద్రంలో సుమారు 50 సంవత్సరాల నాటి పాత భవనం కూలి నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన మరవకముందే, తాజా దుస్థితి పై సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి కార్యాలయంలో విధులు నిర్వర్తించేందుకు ఉద్యోగులు జంకుతున్నారు.
మర్పల్లి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సుమారు 40 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కార్యాలయంలో వివిధ విభాగాలకు చెందిన సుమారు 40 మంది ఉద్యోగులు నిత్యం విధి నిర్వహణ చేస్తున్నారు. అయితే, గత నాలుగైదు ఏళ్లుగా వర్షాకాలం వస్తే చాలు ఈ కార్యాలయం పైకప్పు నుంచి నీరు కారి లోపలంతా చిత్తడిగా మారుతోంది. వాన పడిన ప్రతిసారీ విలువైన భూ రికార్డులు తడిసిపోకుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్లతో కప్పాల్సిన దుస్థితి నెలకొందని రైతులు గుర్తు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం సర్వే రూమ్ వేనుక భాగంలోని బాత్‌రూమ్ గోడ హఠాత్తుగా కూలిపోవడంతో అప్పట్లోనే ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
శనివారం జరిగిన ప్రమాద నేపథ్యంలో, "మా కార్యాలయం కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరింది.. రేపు మా పరిస్థితి ఏమిటో?" అని ఉద్యోగులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. కార్యాలయానికి మరమ్మతులు చేపట్టాలని లేదా నూతన భవనాన్ని నిర్మించాలని అప్పటి నుంచి ఇప్పటివరకు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.నిత్యం వందలాది మంది ప్రజలు, రైతులు, విద్యార్థులు వచ్చే ఈ కార్యాలయం భద్రత పై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా తెలంగాణ శాసనసభాపతి ప్రసాద్ కుమార్,అలాగే జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, మర్పల్లి మండల కేంద్రానికి నూతన తహసిల్దార్ కార్యాలయ భవనాన్ని మంజూరు చేయాలని స్థానిక ప్రజలు,విద్యార్థులు, రైతులు కోరుతున్నారు.






