గ్రూప్ - 1 కు మార్కులు ఖరారు.. ఇంటర్వ్యూ మార్కులు ఎత్తివేత!

by Disha Web Desk 2 |
గ్రూప్ - 1 కు మార్కులు ఖరారు.. ఇంటర్వ్యూ మార్కులు ఎత్తివేత!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్ - 1కు 900 మార్కులు ఖరారు చేస్తున్నారు. గ్రూప్‌ – 1, గ్రూప్‌ – 2 ఉద్యోగాల నియామకాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు కేబినెట్ నిర్ణయం తీసుకుని జీవో నెంబర్​ 47ను విడుదల చేసింది. రాష్ట్ర స్థాయిలో గ్రూప్ - 1 ఆ తర్వాత గ్రూప్ - 2 అత్యున్నత స్థాయి ఉద్యోగాలు. ఈ నియామకాల్లో మరింత పారదర్శకత పెరిగేందుకే ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా సీఎస్ సోమేశ్ కుమార్ జీవో-47 విడుదల చేశారు. ఇంటర్వ్యూలు ఎత్తివేయడంతో కేవలం రాతపరీక్ష ఆధారంగా మార్కులను కేటాయించనున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన ప్రకారం.. గ్రూప్‌-1, 2 నియామకాలకు మొదట ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి, అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో దశలో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించేవారు. రాత పరీక్షల్లో మెరిట్‌ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఎంపిక చేసేవారు. ఇలా మొత్తం వెయ్యి మార్కులతో మెరిట్​ ప్రకారం ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. ప్రభుత్వం తొలి విడుతగా గ్రూప్​ –1లో 503, గ్రూప్​ –2లో 582, గ్రూప్​ –3లో 1,373, గ్రూప్​ –4లో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటి వరకు గ్రూప్ – 3, గ్రూప్ – 4 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించకపోగా.. ఇక నుంచి గ్రూప్ – 1, గ్రూప్ –2 పోస్టులకు కూడా ఇంటర్వ్యూలు ఉండవు.

సందేహాలకు బ్రేక్ వేస్తూ

గ్రూప్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూల రద్దుతో వీటికి సంబంధించిన మార్కులను ఎలా సర్దుబాటు చేస్తారనే అంశాలపై ఇప్పటి వరకు క్లారిటీ లేకుండా పోయింది. మొత్తంగా వెయ్యి మార్కులకు రాత పరీక్షలను నిర్వహించి, ఇంటర్వ్యూలకు సంబంధించి గ్రూప్​ –1లో వంద మార్కులు, గ్రూప్ - 2లో 75 మార్కులకు రీ షెడ్యూల్​చేయాల్సి వస్తుందని అంచనా వేశారు. దీనిపై టీఎస్​పీఎస్సీ నుంచి, ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు సీఎస్ జీవో నెంబర్​75ను వెల్లడించినా.. ఈ మార్కులపై స్పష్టత ఇవ్వలేదు.

900 మార్కులతోనే!

ప్రస్తుతం 900 మార్కులకు గ్రూప్​- 1 పరీక్షలను పాత సిలబస్ ప్రకారమే నిర్వహించేందుకు ప్రభుత్వ ఆదేశాలతో టీఎస్​పీఎస్సీ నిర్ణయించింది. ఇప్పటి వరకు నిర్వహించిన ప్రకారం గ్రూప్‌ -1 మెయిన్స్‌లో 900 మార్కులు, ఇంటర్వ్యూ 100 మార్కులు కలిపి మొత్తంగా వెయ్యి మార్కులు ఉంటాయి. ఇప్పుడు ఇంటర్వ్యూలను రద్దు చేయడంతో 100 మార్కులు తగ్గి 900 మార్కులకే గ్రూప్-1 పరిమితమవుతోంది. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. ఇంటర్వ్యూలు రద్దు చేయడంతో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగానే ఉద్యోగ ఎంపిక చేయనున్నారు. దీనిపై టీఎస్​పీఎస్సీ అధికారికంగా సర్క్యూలర్​ జారీ చేయనున్నారు.

6‌00 మార్కులతో గ్రూప్​ –2

ఇక గ్రూప్‌ -2లో రాత పరీక్షను 600 మార్కులు, ఇంటర్వ్యూకు 75 మార్కులు కలిపి మొత్తంగా 675 మార్కులు ఉంటాయి. కానీ, ఇంటర్వ్యూలను ఎత్తివేయడంతో 75 మార్కులు తగ్గి 600 మార్కులకే గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షా విధానాలపై త్వరలోనే మరింత క్లారిటీ ఇస్తూ జీవోలు జారీ చేయనున్నారు.

భవిష్యత్తులో ఇబ్బందులంటున్న నిపుణులు

కాగా, ఇంటర్వ్యూను రద్దు చేయడంతో చాలా ఇబ్బందులు వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో 900 మార్కులకు రాత పరీక్ష నిర్వహించినా ఇంటర్వ్యూలను ఎదుర్కొలేక, బోర్డు సభ్యుల ముందు సరైన విధంగా సమాధానాలు చెప్పలేక వెనుదిరిగిన వారున్నట్లు చెప్పుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పోస్టల ప్రకారం అత్యున్న కుర్చీలో విధులు నిర్వర్తించే గ్రూప్​ –1 ఆఫీసర్స్​సరైన సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఒత్తిళ్లు, ఆందోళనల మధ్య ఎలా సమర్ధవంతంగా ఉంటారనే అంశాలను ఇంటర్వ్యూ ద్వారానే తెలుస్తుందంటున్నారు.

ఇది తాత్కాలిక సంబురమే : విఠల్​, టీఎస్​పీఎస్సీ మాజీ సభ్యుడు

గ్రూప్​–1, 2 ఉద్యోగాల ఎంపికలో ఇంటర్వ్యూలను రద్దు చేసినందుకు నిరుద్యోగ యువత సంబురపడుతున్నా ఇది తాత్కాలికమేనన్నారు. చాలామంది అర్హులకు అన్యాయం జరుగుతుందని, ముందుగా ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. గతంలో టీఎస్ పీఎస్సీ చేసిన ఇంటర్వ్యూల్లో బోర్డు సభ్యుల్లో సైక్రియాటిస్ట్ కూడా ఉండేవారని, రాత పరీక్ష ఎలా రాశారనే అంశాన్ని పక్కన పెడితే.. ఇంటర్వ్యూల్లో వ్యవహరించిన తీరు ప్రధానమన్నారు. అయితే ఇంటర్వ్యూల్లో అక్రమాలు జరుగుతాయనేది అవాస్తమని, దీనికోసం ప్రత్యేకంగా ఒక కోడ్‌ను అభ్యర్థులకు కేటాయించి, వారిని అదే కోడ్‌తో ఇంటర్వ్యూలకు పిలిచామని, అంతేకానీ, అభ్యర్థి పేరు, ప్రాంతం, ఎక్కడ చదివారు, కులం వంటి వివరాలను తెలుసుకోలేదని, దానికి సంబంధించిన వివరాలు కూడా ఇంటర్వ్యూ సమయంలో బోర్డు సభ్యులకు తెలియకుండా నిబంధనలు విధించినట్లు తెలిపారు. కానీ, ఇప్పుడు ఇంటర్య్వూలను రద్దు చేయడంతో సదరు అభ్యర్థి మానసిక స్థితిని కూడా అంచనా వేయలేమన్నారు. కొంతమంది ఉన్నత చదవులు చదివినా మానసిక స్థితి అంతగా ఉండని పరిస్థితులు ఉంటాయని, గ్రూప్​– 1 పోస్టు అంటే కాబోయే ఐఏఎస్, ఐపీఎస్ అని, అలాంటి వారిని ఇంటర్వ్యూలు లేకుండా నియమించడం కరెక్ట్​కాదని అభిప్రాయపడ్డారు. ఒక సమస్యను అత్యవసర సమయంలో పరిష్కరించడంలో చూపించే చొరవ, సమస్యలను ఎదుర్కొవడం, అడ్మినిస్ట్రేషన్​పరమైన నిర్ణయాలు, ప్రజలతో ఎలా మసులుకోవాలి, అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా మెంటల్​కండీషన్​ఎలా ఉంటుందో ఇంటర్వ్యూల్లోనే తెలుస్తాయని విఠల్​అభిప్రాయపడ్డారు.


Next Story

Most Viewed