చావుకు ముందే అన్ని ఏర్పాట్లు.. అర్ధరాత్రి బావిలోకి దూకిన వ్యక్తి.. చివరి క్షణంలో ఊహించని ట్విస్ట్!

by Jakkula.Mamatha |

అర్ధరాత్రి వెల్గటూర్ మండల కేంద్రంలో హైడ్రామా చోటు చేసుకుంది.

చావుకు ముందే అన్ని ఏర్పాట్లు.. అర్ధరాత్రి బావిలోకి దూకిన వ్యక్తి.. చివరి క్షణంలో ఊహించని ట్విస్ట్!
X

దిశ, వెల్గటూర్: అర్ధరాత్రి వెల్గటూర్ మండల కేంద్రంలో హైడ్రామా చోటుచేసుకుంది. అయినవాళ్లు అందరూ ఉన్న యువకుడు జీవిత భాగస్వామికి దూరమై రోగాల కుప్పలా మారి జీవితంపై విరక్తి చెందాడు. ఈ క్రమంలోనే చావుకు ముందే ఏర్పాట్లు చేసుకొని అర్ధరాత్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. చివరి నిమిషంలో బతుకు పట్ల ఆశ చావక రెండు గంటలపాటు బావిలో జరిగిన జీవన్మరణ పోరాటంలో స్థానికులు వచ్చి కాపాడగా ప్రాణాలతో బయటపడ్డ సంఘటన మండలంలో సంచలనం రేపుతోంది.

వెల్గటూర్ మండల కేంద్రానికి చెందిన వొజ్జల సంతోష్ అనే వ్యక్తి జీవితంపై విరక్తి చెంది అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తమ ఇంటిలోను చేద బావిలో ఆత్మహత్య చేసుకోవడానికి దూకాడు. అయితే దూకిన తర్వాత చివరి నిమిషంలో మనసు మార్చుకుని కేకలు వేయగా అతని అమ్మ గమనించి స్థానిక సర్పంచ్ కు ఫోన్ ద్వారా సమాచారం చేరవేసింది. సర్పంచ్ భర్త బండ మీది గోపి వార్డు మెంబర్ సురేష్ వచ్చి కాపాడటంతో అతని ప్రాణాలు దక్కాయి. ముందు రోజే చావు నిర్ణయించుకొని దానికి సంబంధించిన కొన్ని ఏర్పాట్లు చేసుకొన్నానని బావిలో నుంచి బయటకు వచ్చిన సంతోష్ చెప్పిన విషయాలు సంచలనం రేపుతోంది. వొజ్జల సంతోష్ అనే వ్యక్తి ఆటో నడుపుకొని భార్య బిడ్డలతో కలిసి వెల్గటూర్ లో జీవనం సాగించేవాడు. కొన్నాళ్ళ క్రితం భార్య చనిపోయింది. అప్పటి నుంచి అతని జీవితం గాడి తప్పింది.

రోగాల కుప్పగా మారాడు. పని చేయడానికి శక్తి లేకుండా పోయింది. దీంతో బిడ్డతో కలిసి తల్లి దగ్గర ఉంటున్నాడు. ఎన్నాళ్ళు ఈ దరిద్రమైన జీవితం అని అనుకున్నాడో ఏమో జీవితంపై విరక్తి చెంది అర్ధరాత్రి ఇంట్లో ఉన్న చేద బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే బావిలో దూకిన వెంటనే అతడు నీటిలో మునిగిపోలేదు. దీంతో చివరి క్షణంలో జీవితంపై ఆశ పుట్టింది. ఎలాగైనా బ్రతకాలనిపించి కేకలు వేయడం మొదలుపెట్టాడు. బయటకు వెళ్ళిన కొడుకు ఎంతసేపైనా రాకపోయేసరికి తల్లి బయటకు వెళ్లి చూడగా బావిలో నుంచి కేకలు వినిపించాయి. వెంటనే ఆమె తెలిసిన వారి వద్దకు వెళ్లి ప్రయత్నించగా అర్ధరాత్రి కావడంతో వారు స్పందించలేదు. దీంతో ఆమె సర్పంచ్ కి ఫోన్ చేయగా సర్పంచ్ భర్త బండమీద గోపి వార్డు మెంబర్ నక్క సురేష్ వారింటికి చేరుకొని మరికొంతమంది యువకులతో కలిసి సంతోష్ ను బావి నుంచి బయటకు తీసి రక్షించారు.

దహన సంస్కారాలకు ముందే ఏర్పాటు చేసుకోవడం విశేషం..

సంతోష్ చనిపోయిన తర్వాత చేయాల్సిన దహన సంస్కారాలకు కావాల్సిన ఏర్పాట్లు ముందే అతను చేసుకోవడం విశేషం. చనిపోయిన తర్వాత అయ్యే ఖర్చుల కోసం రూ. 20,000 ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాను. అలాగే టెంట్ వేయాలని స్థానిక టెంట్ హౌస్ యజమాని వనపర్తి గిరికి చెప్పడం, ఇంకా మరికొన్ని ఏర్పాట్లు చేసుకున్నానని జీవితంపై విరక్తి తోనే ఇదంతా చేశానని చెప్పాడు. తన కూతురు అనాధగా ఉంటుందని భయం వేసి చివరి నిమిషంలో బతుకు పై ఆశ పుట్టి మనసు మార్చుకున్నట్లు సంతోష్ చెప్పడం విశేషం. చావు అంటే ఎవరికైనా భయంతో చెమటలు పడతాయి. అలాంటిది, ఈ రాత్రికే నేను చనిపోతానని ముందే తెలుసుకొని ఓ రోజంతా గడిపి చావుకు ముందే అన్ని ఏర్పాట్లు చేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చివరి క్షణంలో మనసు మార్చుకొని ప్రాణాలతో బయట పడటం విశేషం.

Next Story