Huzurabad: రియల్ ఎస్టేట్ వెంచర్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి

by Gantepaka Srikanth |

హుజురాబాద్ పట్టణ శివారులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించడం స్థానికంగా కలకలం రేపింది.

Huzurabad: రియల్ ఎస్టేట్ వెంచర్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి
X

దిశ,​హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ పట్టణ శివారులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించడం స్థానికంగా కలకలం రేపింది. నాగేంద్ర దాబా సమీపంలోని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన గుడి తిరుపతిరెడ్డి (43) గత కొంతకాలంగా పట్టణంలోని ఓ వెంచర్‌లో షెడ్డు వేసుకుని ఒంటరిగా నివసిస్తున్నాడు. అతనికి భార్యాపిల్లలు లేకపోవడంతో బంధువులే అతని యోగక్షేమాలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మృతుని బావ కుమారుడు శివారెడ్డి చూడ డానికి వెళ్లగా గది తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా తిరుపతిరెడ్డి విగతజీవిగా పడి ఉన్నాడు.

తిరుపతిరెడ్డి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడికి చెందిన 3 ఎకరాల భూమిని ఒక రాజకీయ నాయకుడు అక్రమంగా పట్టా చేయించుకుని మోసగించాడని ఆరోపిస్తున్నారు. ఆ భూమి విషయంలోనే ఈ మృతి సంభవించి ఉండవచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు. గత కొద్దిరోజులుగా భూమి విషయమై తిరుపతిరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని వారు పేర్కొంటున్నారు. పోలీసులు ఈ ఘటనపై సమాచారం అందుకుని దర్యాప్తు ప్రారంభించాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే ఇది ఆత్మహత్యా లేక హత్య అనే కోణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Next Story