మల్లారెడ్డికో బుక్కుంది.. దానికో లెక్కుంది..

by Ratna Kumari |   (  Updated:2026-06-26 16:26:43  IST  )

నిబంధనలను తుంగలో తొక్కి లాభాలే పరమావధిగా అడ్డూ అదుపూ లేకుండా కొనసాగిస్తున్న కల్లు దందా, మధ్యం దుకాణాలు, బెల్టు షాపుల వ్యాపారులు ఇప్పుడు టెన్షన్ లో పడ్డారు.

మల్లారెడ్డికో బుక్కుంది.. దానికో లెక్కుంది..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిబంధనలను తుంగలో తొక్కి లాభాలే పరమావధిగా అడ్డూ అదుపూ లేకుండా కొనసాగిస్తున్న కల్లు దందా, మధ్యం దుకాణాలు, బెల్టు షాపుల వ్యాపారులు ఇప్పుడు టెన్షన్ లో పడ్డారు. తమ అక్రమ కల్తీ దందాను, అక్రమ వ్యాపారాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడిపించుకోవడానికి ప్రతినెలా ఎవరెవరు, ఎంతెంత ముడుపులు ఎక్సైజ్ ఉన్నతాధికారికి సమర్పించుకున్నారో అన్నీ లెక్కలతో సహా బయట పడ్డాయి. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి డైరీ బయటపడిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అధికారికి ముడుపులు సమర్పించుకున్న ముస్తేదారులు, మధ్యం వ్యాపారులు, కల్లు డిపో నిర్వాహకులు టెన్షన్ కు గురవుతున్నారు. మల్లారెడ్డిది గా ప్రచారంలో ఉన్న డైరీలో నిజామాబాద్ జిల్లాలో ఎవరి నుండి ఎంతెంత వసూలు చేసారనేది స్పష్టంగా రాసి ఉన్న డైరీ విషయం బైటికి పొక్కింది. మల్లారెడ్డి కార్యాలయాల్లో, నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించినప్పటి నుండి ఆయన గురించి ఆయన సొంత శాఖకు చెందిన అధికారులు, సిబ్బందే ఆయన అవినీతి వ్యవహారాలు, కింది స్థాయి అధికారులు, సిబ్బంది అంటే లెక్కలేని తనం గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. సాధారణంగా ఏదైనా శాఖలో ఉన్నతాధికారి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా, ఆఫీసు, నివాసంలో తనిఖీలు నిర్వహించినా ఆ శాఖకు చెందిన సిబ్బంది, అధికారులు సానుభూతి ప్రకటించడం చూస్తుంటాం. కానీ, మల్లారెడ్డి విషయంలో నిజామాబాద్ లో అలాంటి పరిస్థితి కనిపించలేదు సరికదా.. అవకాశం దొరికింది కదా అని ఆయన అవినీతి భాగోతం గురించి పలువురు మీడియాకు లీకులు కూడా ఇచ్చారు.

మాటల్లో నిజాయితీ.. చేతల్లో అంతా అవినీతే..

మల్లారెడ్డి జిల్లా అధికారిగా జిల్లాలో ఛార్జి తీసుకున్నప్పటి నుండి ఆయన వ్యవహార శైలిపై కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు, కల్లు, మధ్యం వ్యాపారులు అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన మాటల్లో మాత్రం నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా కనిపించినప్పటికీ, మామూళ్ల విషయంలో ఎవరెవరిని టార్గెట్ చేయాలో, ఎలా తమ దారికి తెచ్చుకోవాలో కింది స్థాయి సిబ్బందికి చెప్పి మరీ చేయించుకునే వారనే టాక్ ఉంది. కల్లు వ్యాపారుల నుండి, బెల్టు షాపుల నుండి ఎక్కువ మొత్తంలో మామూళ్లు వసూలు చేయాలని సిబ్బందిపై ఒత్తిడి తెచ్చే వాడని, సరిగా స్పందించని వారిని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేసే వాడనే ఆరోపణలున్నాయి. కల్లు డిపో నిర్వాహకులతో, వ్యాపారుల సంఘాలు, సొసైటీ ప్రతినిధులతో నేరుగా సంబంధాలు పెట్టుకుని డైరెక్టుగా నెలవారీ ముడుపులు డీల్ చేసుకునే వాడనే ఆరోపణలున్నాయి. ఆయన అవినీతి భాగోతాన్ని బయటి వ్యక్తులతో పాటు, ఎక్సైజ్ శాఖకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది కూడా ఓరల్ గా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆయనపై ఉచ్చు బిగుసుకుంటున్న విషయాన్ని మల్లారెడ్డి పసిగట్టలేకపోయారని, చివరకు సొంత శాఖలోని పలువురి సహకారంతోనే మల్లారెడ్డి అవినీతి భాగోతం అంతా ఆధారాలతో సహా ఉన్నతాధికారులకు చేరవేశారనే టాక్ వినిపిస్తోంది. ఇదంతా ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఇదంతా కొద్ది నెలలుగా చాపకింద నీరులా జరుగుతోందని సమాచారం.

సీక్రెట్ డైరీలో ఓ జడ్పీటీసీ పేరు..

మల్లారెడ్డి తన వసూళ్ల చిట్టాను సీక్రెట్ గా మెయింటేన్ చేస్తున్న డైరీలో రాసుకున్నట్లు బయట పడింది. ఆయన బుక్కులో బోధన్ డివిజన్ లోని ఓ జడ్పీటీసీ పేరుతో పాటు, మధ్యం వ్యాపారుల సంఘానికి చెందిన ప్రముఖ నాయకుడి పేరు కూడా ఉన్నట్లు సమాచారం. ఇంతకు ముందు ఎంత తీసుకుంది.. ఇప్పుడెంత తీసుకుందనే లెక్కలు ఇంగ్లీష్ దెన్.. నౌ అంటూ రెండు లెక్కలు రాసుకోవడాన్ని బట్టి చూస్తే మల్లారెడ్డికి ఓ బుక్కుంది.. దానికో లెక్కుందనే విషయాన్ని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ డైరీలో నమోదైన అవినీతి లంచాల లెక్కలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఎక్సైజ్ శాఖ పరువు గుల్ ఫారం కల్లులో కలిపేసిన మడ్డీలా తయారైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

లెక్క తప్పకుండా డైరీలో రాసుకున్నట్లు ..

తెలంగాణ ఎక్సెజ్ శాఖ మామూళ్ల వ్యవహారం రచ్చకెక్కింది. నిజామాబాద్ జిల్లా ఎక్సెజ్ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారికి సంబంధించినదిగా ప్రచారంలో ఉన్న ఓ సీక్రెట్ డైరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని వైన్ షాపులు, కల్లు డిపోల నుంచి ప్రతి నెలా దాదాపు రూ. 2 లక్షల వరకు అందుతున్న అక్రమ వసూళ్ల లెక్కలు సదరు డైరీలో స్పష్టంగా ఉండటంతో ఇటు సంబంధిత శాఖలో.. అటు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రతినెలా ప్రభుత్వం నుండి వచ్చే జీతం డబ్బుల కన్నా, అడ్డదారిలో వచ్చే లంచాలపైనే మక్కువ చూపే మల్లారెడ్డి సీక్రెట్ గా రాసుకున్న డైరీ ఆయన పరువును పూర్తిగా తీసెసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ అధికారుల తనిఖీ అరెస్ట్ తరువాతే డైరీ విషయం బైటికి పొక్కినట్లు సమాచారం.

లంచం ఇచ్చిన వారిపై ఏసీబీ ఫోకస్ ఉంటుందా?

లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. అయితే మల్లారెడ్డి కేసులో ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. మరి ఆయనకు లంచం ఇచ్చిన వారి పట్ల ఏసీబీ ఏ రకంగా వ్యవహరిస్తుందోననే ఆసక్తి అందరిలో నెలకొంది. ఎందుకంటే మల్లారెడ్డి ఎవరి నుండి ఎంతెంత లంచాలు తీసుకున్నాడనేది డైరీ ఆధారంగా లెక్కలు పక్కాగా ఉన్నాయి. ఆ లెక్కలన్నీ ఏసీబీ అధికారులు ఇప్పటికే పరిశీలించారని తెలుస్తోంది. విచారణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో డైరీలో ఉన్న పేర్ల ఆధారంగా వారిపై ఏసీబీ చర్యలు కచ్చితంగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఏం జరుగుతుందోననే ఆసక్తి జిల్లా ప్రజలకు, టెన్షన్ మాత్రం వ్యాపారుల్లో ఉంది.

Next Story