శిథిలావస్థలో మక్తల్ ఏరియా హాస్పిటల్ : సి.ఆర్. గోవింద్‌రాజ్

by Batti.Sumithra |

పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ భవనం శిథిలావస్థకు చేరుకుందని, కర్నే పీహెచ్‌సీ ఆయుర్వేద ఆసుపత్రికి ప్రహరీ గోడ లేకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి విషపురుగులు సంచరిస్తున్నాయని, నూతనంగా నిర్మిస్తున్న భవనంలోకి వెంటనే మార్చాలని సీపీఎం మక్తల్ నియోజకవర్గ నాయకుడు సి.ఆర్. గోవింద్‌రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.

శిథిలావస్థలో మక్తల్ ఏరియా హాస్పిటల్ : సి.ఆర్. గోవింద్‌రాజ్
X

దిశ, మక్తల్ : పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ భవనం శిథిలావస్థకు చేరుకుందని, కర్నే పీహెచ్‌సీ ఆయుర్వేద ఆసుపత్రికి ప్రహరీ గోడ లేకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి విషపురుగులు సంచరిస్తున్నాయని, నూతనంగా నిర్మిస్తున్న భవనంలోకి వెంటనే మార్చాలని సీపీఎం మక్తల్ నియోజకవర్గ నాయకుడు సి.ఆర్. గోవింద్‌రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం సీపీఎం పార్టీ బృందం ఆధ్వర్యంలో ఆసుపత్రిని సందర్శించి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. రోజుకు 400 నుంచి 450 మంది వరకు ఔట్‌పేషెంట్లు వస్తుంటారని, వారికి మెరుగైన వైద్యం అందించాలంటే శిథిలావస్థకు చేరుకున్న భవనంలో కాకుండా నూతన భవనంలో సేవలు అందించాలని ఆయన అన్నారు.

ప్రస్తుతం పాత భవనంలో చికిత్స పొందుతున్న రోగులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. నూతనంగా నిర్మిస్తున్న ఏరియా హాస్పిటల్ భవనాన్ని వెంటనే పూర్తి చేసి, పాత భవనం నుంచి కొత్త భవనంలోకి ఆసుపత్రిని మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం కర్నే పీహెచ్‌సీ ఆయుర్వేద ఆసుపత్రిని సందర్శించారు. ఆ ఆసుపత్రికి ప్రహరీ గోడ లేకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి అపరిశుభ్రత నెలకొని, విషపురుగుల సంచారంతో ప్రమాదకర వాతావరణం ఏర్పడిందన్నారు. వెంటనే ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని, ప్రజారోగ్యం పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సీపీఎం పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కే.ఎం. మహేందర్, అశోక్, నరేష్, కోళ్ల అశోక్, జి. బాల్‌రాజ్, బి. శివ తదితరులు పాల్గొన్నారు.

Next Story