ఢిల్లీ అసెంబ్లీలో భారీ భద్రతా వైఫల్యం.. ముగ్గురు అరెస్ట్

by Malleboina Mahesh |

ఢిల్లీ అసెంబ్లీలో భారీ భద్రతా వైఫల్యం! కారులో దూసుకెళ్లి స్పీకర్ ఆఫీసులో బొకే పెట్టిన నిందితులు. ముగ్గురు అరెస్ట్.

ఢిల్లీ అసెంబ్లీలో భారీ భద్రతా వైఫల్యం.. ముగ్గురు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధానిలో అత్యంత భద్రత ఉండే ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. గుర్తు తెలియని నిందితుల కలయిక కలకలం గా మారింది. జాతీయ మీడియా వార్తల ప్రకారం.. ఢిల్లీ భారీ భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఒక టాటా సియారా (Tata Sierra) కారు అసెంబ్లీ లోపలికి దూసుకెళ్లడం భద్రతా సిబ్బందిని ఉలిక్కిపడేలా చేసింది. నిందితులు కేవలం లోపలికి ప్రవేశించడమే కాకుండా, ఏకంగా స్పీకర్ కార్యాలయం వరకు వెళ్లి అక్కడ ఒక పూల బొకేను ఉంచి, తిరిగి అదే కారులో వేగంగా బయటకు దూసుకెళ్లారు. ఈ అనూహ్య పరిణామంతో అసెంబ్లీ భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ముగ్గురు నిందితుల అరెస్ట్

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గాలింపు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సరబ్‌జిత్ సింగ్‌‌తో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నిందితులు అసెంబ్లీ గేట్ల వద్ద ఉన్న సెక్యూరిటీని ఎలా దాటగలిగారు? వారి ఉద్దేశం కేవలం నిరసన తెలపడమేనా లేక మరేదైనా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

అసెంబ్లీ భద్రతపై సమీక్ష..

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయం, కీలకమైన రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగడం భద్రతా వైఫల్యానికి నిదర్శనమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నిందితులు వాడిన టాటా సియారా కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేశారు. అలాగే ఘటన వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

Next Story