GHMC ఎన్నికల వేడి.. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో అలర్ట్ అయిన ప్రధాన పార్టీలు!

by Jakkula.Mamatha |

తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభంతో జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయం ఇచ్చిన ఉత్సాహంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయం పై పూర్తి దృష్టి పెట్టి ఇటీవల మణికొండలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

GHMC ఎన్నికల వేడి.. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో అలర్ట్ అయిన ప్రధాన పార్టీలు!
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభంతో జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయం ఇచ్చిన ఉత్సాహంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయం పై పూర్తి దృష్టి పెట్టి ఇటీవల మణికొండలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పట్లో లేనప్పటికీ మరి కొన్ని నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ను జీహెచ్ఎంసీ , సీఎంసీ, ఎంఎంసీ ఇలా మూడు కార్పొరేషన్లు విభజించడంతో పాటు గతంలో ఉన్న 150 డివిజన్లను 300 లకు పెంచగా ఈ ఎన్నికలను టార్గెట్ చేసి మెజార్టీ కార్పొరేటర్ స్థానాలు గెలుచుకోవడం పైనే పార్టీ అధినేత సమాయత్తం అవుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి . బల్దియాలో బలాన్ని మూటగట్టుకుని శాసనసభ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన లో ఉన్నప్పటికీ ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పవన్ కళ్యాణ్ ఎత్తులను ఎలా చిత్తు చేస్తాయనేది చర్చనీయాంశంగా మారింది . హైదరాబాద్ నగర పరిధిలో జనసేన పార్టీ ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా లేదా కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్, యువతలో ఉన్న ఆదరణను ఓట్లుగా మలుచుకోవడానికే ముందుచూపుతో సాగుతున్నారని , గ్రేటర్ పరిధిలోని మెజారిటీ స్థానాల్లో కుదిరితే ఏపీ మాధిరిగా పొత్తు, లేకపోతే ఒంటరిగానైనా పోటీ చేసేందుకు పార్టీ సిద్ధమవుతోందని టాక్ వినబడుతోంది. 2020 ఎన్నికల్లో జనసేన సుమారు 60 కి పైగా స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని భావించినప్పటికీ ఆఖరి నిమిషంలో బీజేపీ అగ్రనాయకత్వంతో జరిగిన చర్చల తర్వాత ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ తమ అభ్యర్థులను పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. పోటీ నుంచి తప్పుకున్న తర్వాత జనసేన పార్టీ బీజేపీ అభ్యర్థుల విజయానికి మద్దతుగా నిలవడం తో ఆ పార్టీ ఏకంగా 48 డివిజన్లను గెలుచుకో కలిగింది .

కీలకంగా మారనున్న సెటిలర్ల ఓట్లు ..

హైదరాబాద్ మహానగరంలో అన్ని ప్రతిష్టాత్మకంగా భావించే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా కుతుబుల్లాపూర్ , శేరిలింగంపల్లి, కూకట్ పల్లి , ఎల్బీ నగర్ , జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సెటిలర్లు అధికంగా ఉంటారు. వీటి ఓట్లపై జనసేన గురి పెట్టినట్లుగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఏపీలో మాదిరిగా టీడీపీ, బీజేపీలతో కలిసి నడుస్తారనే టాక్ సైతం వినబడుతోంది . అయితే తమిళనాడు మాదిరిగా పవన్ కళ్యాణ్ సినీ మంత్రం పనిచేస్తుందా ? ఇది ఎంతవరకు రాజకీయంగా ఉపయోగపడుతుందనేది చర్చనీయాంశంగా మారింది . కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో కేవలం రాజకీయ లాభం కోసమే, పార్లమెంట్ తలుపులు మూసి వేసి, చాలా తొందరపాటుగా, అనాలోచితంగా రాష్ట్రాన్ని విభజించిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య సయోధ్య కుదర్చకుండా విభజించడం వల్లే సమస్యలు వచ్చాయని ఆయన వాదించారు. ఇటీవల ఢిల్లీలో తాను తెలంగాణకు వ్యతిరేకం కాదు, విభజన తీరుకు వ్యతిరేకం అని పవన్ కళ్యాణ్ అన్నారు. వీటి ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎంత వరకు ఉంటుంది ? అభిమానం ఓట్లు రాలుస్తుందా ? పొత్తులు ఎవరెవరితో ఉంటాయి ? అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది

సభకు అనుమతి నిరాకరణతో..

ఈ నెల ప్రారంభంలో హైదరాబాద్‌లో జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ’కు కాంగ్రెస్ ప్రభుత్వం (సైబరాబాద్ పోలీసులు) అనుమతి నిరాకరించడం రెండు పార్టీల మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో సుమారు 2 వేల మందితో ఇండోర్ సమావేశం పెట్టాలని జనసేన భావించింది. కానీ శాంతిభద్రతల సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులను సాకుగా చూపుతూ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దీనిపై జనసేన కోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు.ఈ పరిణామం తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో తెలంగాణ మీ అయ్య సొత్తా అంటూ మాటల యుద్ధం నడిచింది.

పోటీకి సై అంటున్న పార్టీలు..

జీహెచ్ఎంసీలో గతంలో జరిగిన ఎన్నికల్లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంల మధ్య నడిచింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈ పర్యాయం కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ తో పాటు జనసేన , టీడీపీ కూడా పోటీ చేసే అవకాశం ఉండటంతో ఈ పర్యాయం పోటీ హాట్ హాట్ గా, రసవత్తరంగా ఉంటుందనే టాక్ నడుస్తోంది . మొత్తం హైదరాబాద్ మహానగరంలో క్రమంగా జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి రాజుకుంటుండగా ఓటర్లు కూడా అన్ని పార్టీలను ఆసక్తిగా గమనిస్తున్నారు .

Next Story