ప్రేమ వ్యవహారంలో యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు నిందితులు అరెస్ట్

by Jakkula.Mamatha |

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం పెద్దబుగ్గారం గ్రామానికి చెందిన నాతరి సతీష్(23) జూన్ 17న కనిపించకుండా పోయాడు.

ప్రేమ వ్యవహారంలో యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు నిందితులు అరెస్ట్
X

దిశ, బోథ్: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం పెద్దబుగ్గారం గ్రామానికి చెందిన నాతరి సతీష్(23) జూన్ 17న కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మొదట నేరడిగొండ పోలీస్ స్టేషన్ నందు మిస్సింగ్ కేసు నమోదు చేయగా, జూన్ 19న బోథ్ మండలం లోని కరాత్‌వాడ చెరువులో మృతదేహం లభ్యమవడంతో కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆదివారం ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్యాప్తులో 48 గంటల్లోనే కేసును చేధించి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని, ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడు అయిన షేక్ సుమేర్ తన ప్రేమకు అడ్డు వస్తున్నాడనే కక్షతో మృతుడు సతీష్‌ను తన సహచరులతో కలిసి మద్యం పార్టీ పేరుతో బోథ్ మండలంలోని కరాత్‌వాడ చెరువు వద్దకు పిలిపించి బలవంతంగా మద్యం తాగించి అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు.

నిందితులు మృతదేహాన్ని చెరువులో పడవేసి, మృతుడి బైక్‌ను ఆదిలాబాద్‌కు తరలించగా, మొబైల్ ఫోన్‌ను రైలులో పడవేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ మరియు ప్రత్యేక బృందాల సహాయంతో కేసును ఛేదించి మొత్తం ఆరుగురు నిందితులు షేక్ సుమేర్(బోథ్ ), గంగాధరి సాయి కృష్ణ(నేరడిగొండ ), బొజ్జ విష్ణు వర్ధన్(నేరడిగొండ) మండలం కుప్టి గ్రామం ), షేక్ అక్రమ్ (బోథ్ ), అబ్దుల్ నెహెఫ్ (బోథ్ ), సయ్యద్ నోమన్ (బోథ్ ) అనే నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలు, మృతుడి ద్విచక్ర వాహనం మరియు సంఘటన స్థలంలో లభించిన ఏడు ఖాళీ బీరు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మృతుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని తెలిసి నేరానికి పాల్పడినందున నిందితులపై భారతీయ న్యాయ సంహిత(BNS) సంబంధిత సెక్షన్లతో పాటు ఎస్సీ/ఎస్టీ (దౌర్జన్యాల నిరోధక) చట్టం సెక్షన్ 3(2)(v) కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు.

Next Story