- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖానాపూర్‌లో అసంపూర్తి రోడ్డు పనులు.. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో సమస్య రోజురోజుకూ జటిలంగా మారుతోంది.

దిశ ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో సమస్య రోజురోజుకూ జటిలంగా మారుతోంది. జగిత్యాల, మంచిర్యాల,నిర్మల్ జిల్లాల నుంచి రోజుకు వేలాది వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటాయి. పనులు సగంలో ఆగిపోవడంతో పట్టణ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో 40 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డును 100 అడుగులకు విస్తరిస్తామని ప్రారంభించిన పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలయ్యాయి. ప్రభుత్వం మారిన తర్వాత కూడా పురోగతి లేదు. మధ్యలో డివైడర్ వేసి వదిలేయడంతో జూనియర్ కళాశాల నుంచి బస్టాండ్ వరకు రహదారి మరింత ఇరుకుగా మారింది. అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, అసంపూర్తి నిర్మాణాలు వాహనదారులకు ప్రమాదంగా మారుతున్నాయి. పాఠశాల, కళాశాల సమయాల్లో ట్రాఫిక్ జామ్ సర్వసాధారణమైంది.
ఎన్నికల ముందు వాగ్దానం చేసి, ఎన్నికలు అయి రెండేళ్లు గడిచినా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ ఉంది అని పట్టణ మేధావులు అంటున్నారు. రోగిని అంబులెన్స్‌లో తీసుకెళ్లాలన్నా ఇక్కడ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నాం అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇరుకైన రోడ్డులో ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటున్నాయి.ప్రతి ఎన్నికల సమయంలో నాయకులు హామీలిస్తున్నారు కానీ, తర్వాత పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. గత వారం రోజులుగా సోషల్ మీడియా వేదికగా పట్టణవాసులు, విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘ నాయకుల మధ్య ఈ అంశంపై చర్చ వైరల్ అవుతోంది. రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ప్రజా సంఘాలు రాబోయే రోజుల్లో ఒకరోజు బంద్‌కు పిలుపునిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రోడ్డు విస్తరణ పనులను సత్వరమే పూర్తి చేసి, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఖానాపూర్ ప్రజలు కోరుతున్నారు.






