బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. బదిలీలు, ప్రమోషన్లలో భారీ సంస్కరణలు!

by Prasad Jukanti |   (  Updated:2026-06-21 09:04:24  IST  )

ప్రభుత్వ బ్యాంకుల్లో బదిలీలు ప్రమోషన్ల విషయంలో మానవ జోక్యం తగ్గించి పారదర్శకత పెంచేలా కేంద్ర ఆర్థిక శాఖ సరికొత్త కసరత్తు చేస్తోంది.

బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. బదిలీలు, ప్రమోషన్లలో భారీ సంస్కరణలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో జాప్యాలు, కఠినమైన హెచ్ఆర్ పద్ధతులపై పెద్ద ఎత్తున్న విమర్శలు వినిపిస్తున్న వేళ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలను మరింత పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మానవ జోక్యాన్ని తగ్గించి, పారదర్శకతను పెంచేందుకు డిజిటలైజేషన్ వైపు కేంద్రం అడుగులు వేస్తోంది. సీనియారిటీ ఆధారిత పదోన్నతులు, బదిలీలను ఆటోమేటెడ్ విధానంలో అమలు చేసేలా డిజిటల్ విధానం తీసుకువచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న 7.5 లక్షల మందికి పైగా ఉద్యోగులకు భారీ ప్రయోజనం చేకూరనుంది.

జూన్ కంటే ముందే బదిలీలు:

చాలా కాలంగా ప్రభుత్వ బ్యాంకుల్లో బదిలీల ప్రక్రియ పారదర్శకంగా లేవని దీనివల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉందనే విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి వల్ల కొన్ని సందర్భాల్లో ఉద్యోగుల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయనే చర్చ ఉంది. ఈ నేపథ్యంలో బదిలీలు, ట్రాన్స్ ఫర్స్ ప్రక్రియలలో మానవ జోక్యాన్ని తగ్గిస్తూ బదిలీల ప్రక్రియ మొత్తాన్ని ప్రత్యేక డిజిటల్ పోర్టల్స్ ద్వారా ఆటోమేట్ చేయాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగం (DFS) బ్యాంకులకు సూచించినట్లు సమాచారం. దీని ప్రకారం స్పష్టమైన సీనియారిటీ జాబితాల ఆధారంగా బదిలీల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా మార్చి, ప్రతి సంవత్సరం జనవరి-ఫిబ్రవరి నెలల్లోనే ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించి ప్రతి ఏటా జూన్ నెల కంటే ముందే ఈ వార్షిక బదిలీల ప్రక్రియను పూర్తి చేయబోతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ సంస్కరణలు గనుక పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి సరికొత్త డిజిటల్ విప్లవానికి నాంది పలికినట్లవుతుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.

Next Story