ఇంగ్లాండ్ వన్డే పర్యటనకు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా గిల్, వైస్ కెప్టెన్‌గా అయ్యర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-21 08:31:39  IST  )

ఇంగ్లాండ్ వన్డే పర్యటనతో పాటు ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు బీసీసీఐ భారత జట్లను ప్రకటించింది.

ఇంగ్లాండ్ వన్డే పర్యటనకు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా గిల్, వైస్ కెప్టెన్‌గా అయ్యర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ వన్డే పర్యటనతో పాటు ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు సంబంధించిన భారత జట్లను సెలెక్టర్లు అధికారికంగా ప్రకటించారు. ఇంగ్లాండ్ వన్డే సిరీస్ జట్టులో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఉన్నప్పటికీ, సెలెక్టర్లు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. మరోవైపు, ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించారు.

రోహిత్-కోహ్లీ ఎంట్రీ

ఇంగ్లాండ్ పర్యటనకు ప్రకటించిన వన్డే జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ జట్టులోకి సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి రాగా, వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లు ఎంపికయ్యారు. ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి స్థానం సంపాదించారు. పేస్ విభాగాన్ని జస్ప్రీత్ బుమ్రా ముందుండి నడిపించనుండగా.. ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్‌లు అతనికి తోడుగా నిలవనున్నారు. ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఎంపికయ్యాడు.

ఇంగ్లాండ్ వన్డే పర్యటనకు భారత జట్టు ఇదే..

శుభ్‌మన్ గిల్ (C), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (VC), కేఎల్ రాహుల్ (WK), ఇషాన్ కిషన్ (WK), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.

ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు వైభవ్ సూర్యవంశీ

ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే అప్‌డేటెడ్ టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తెలుగు స్టార్ తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. అయితే, ఈ జట్టులో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. నేడు ట్రై-సిరీస్ ఫైనల్లో కేవలం 11 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన లిస్ట్-ఏ హాఫ్ సెంచరీ బాదిన సూర్యవంశీకి సెలెక్టర్లు భారత జట్టులోకి తీసుకుంటూ బంపారఫర్ ఇచ్చారు. ఈ జట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబేలతో పాటు యువ ఆటగాళ్లు ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణాలకు చోటు దక్కింది. తెలుగు ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి వన్డేలతో పాటు టీ20 జట్టులోనూ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే..

శ్రేయస్ అయ్యర్ (C), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (WK), ఇషాన్ కిషన్ (WK), శివమ్ దూబే, తిలక్ వర్మ (VC), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.

Next Story