పనసపండ్ల మాటున రూ.1.93 కోట్ల గంజాయి రవాణా

by Taduka Kalyani |

పనసపండ్ల లోడ్ మాటున ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రూ.1.93 కోట్ల విలువైన భారీ గంజాయి రవాణాను కామారెడ్డి పోలీసులు భగ్నం చేశారు.

పనసపండ్ల మాటున రూ.1.93 కోట్ల గంజాయి రవాణా
X

దిశ, కామారెడ్డి రూరల్: పనసపండ్ల లోడ్ మాటున ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రూ.1.93 కోట్ల విలువైన భారీ గంజాయి రవాణాను కామారెడ్డి పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో 387.128 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, నగదు, పనసపండ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ కవచ్’ కింద ప్రత్యేక నిఘా, నాకాబందీలు, వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌కు భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్నట్లు దేవున్‌పల్లి పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే కామారెడ్డి డీఎస్పీ మధుసూధన్ పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. శనివారం సాయంత్రం జాతీయ రహదారి-44పై క్యాసంపల్లి గ్రామ శివారులోని రాయల్ ధాబా సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. వాహనంలో ఉన్న వ్యక్తులు పనసపండ్ల వ్యాపారం చేస్తున్నట్లు చెప్పినా, వాహనంలో పండ్లను అమర్చిన విధానం అనుమానం కలిగించడంతో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ప్రత్యేక బృందాలతో గాలింపు


ఈ తనిఖీల్లో పనసపండ్ల కింద సంచుల్లో దాచిన భారీ మొత్తంలో గంజాయి బయటపడింది. ఒడిశా నుంచి నాసిక్‌కు తరలిస్తున్న ఈ గంజాయి విలువ సుమారు రూ.1,93,56,400గా పోలీసులు అంచనా వేశారు. అరెస్టు చేసిన నిందితులను నిజాంబాద్ జిల్లాకు చెందిన షేక్ కరిముల్లా అలియాస్ కరీం, గైని సుభాష్, షేక్ రహీంగా గుర్తించారు. అధిక లాభాల కోసం గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినట్లు వారు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోందని, గంజాయి సరఫరా గొలుసు, ఆర్థిక లావాదేవీలు, ముఠాతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. జిల్లాలో డ్రగ్స్ మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తున్నాం. అక్రమ రవాణా, విక్రయాలు, నిల్వలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా ముఠాను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన డీఎస్పీ మధుసూధన్, సీఐ శ్రీధర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రామన్, ఎస్‌ఐలు రంజిత్, విజయ్, అంజనేయులు, అనిల్, పుష్పరాజ్ తదితర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు బహుమతులు అందజేశారు.

Next Story