- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్తు ఇంజక్షన్లతో పశువుల దొంగతనం.. అంతర్రాష్ట్ర ఘరానా ముఠా గుట్టురట్టు
పశువులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి కార్లలో ఎక్కించుకుని మహారాష్ట్రలోని వధశాలలకు తరలిస్తూ అక్రమంగా విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ఘరానా దొంగల ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఛేదించారు.

దిశ,ఆదిలాబాద్ : పశువులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి కార్లలో ఎక్కించుకుని మహారాష్ట్రలోని వధశాలలకు తరలిస్తూ అక్రమంగా విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ఘరానా దొంగల ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులపై కేసు నమోదు చేయగా, ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మిగతా నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని వెల్లడించారు. ఆదివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. ఈ ముఠాకు చెందిన సభ్యులు రాత్రి వేళల్లో ఎస్‌యూవీ,ఇన్నోవా వాహనాల వెనుక సీట్లను తొలగించి,పశువులకు మత్తు మందులు ఇచ్చి వాహనాల్లో ఎక్కించి మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ ప్రాంతంలోని వధశాలలకు తరలించేవారని తెలిపారు. అక్కడ పశువులను విక్రయించి భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఈ ముఠాలో ఉన్నారని, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పశువుల దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించామని చెప్పారు. పోలీసుల కంటపడకుండా ఉండేందుకు నిందితులు వాహనాలకు నకిలీ నంబర్ ప్లేట్లు అమర్చుకొని, టోల్‌ప్లాజాలు, చెక్‌పోస్టులు లేని మార్గాలను ఎంచుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.
13 మందిపై కేసు ఐదుగురు అరెస్ట్
ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి ఒక కారు, ఐదు సెల్‌ఫోన్లు, నకిలీ నంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత ఏడాదిన్నర కాలంలో ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు, తాంసి, జైనథ్, ఆదిలాబాద్ వన్‌టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో మొత్తం ఏడు పశువుల దొంగతనాలకు ఈ ముఠా పాల్పడినట్లు గుర్తించామని పేర్కొన్నారు. నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో కూడా వీరిపై కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. పశువుల దొంగతనాలపై వచ్చిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీ కెమెరా దృశ్యాలు, వాహనాల కదలికలు, సాంకేతిక ఆధారాలు, కాల్ డేటాను విశ్లేషించడం ద్వారా కేసును ఛేదించినట్లు ఎస్పీ వివరించారు. ప్రజలు తమ పశువులను రాత్రి వేళల్లో సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.ఈ సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.






