నా భార్య నాకే కావాలి.. సెల్ ఫోన్ టవర్ ఎక్కిన భర్త

by Kodari Anjali |

భార్య తనతో పాటు ఉండడం లేదని మనస్థాపంతో ఓ భర్త సెల్ ఫోన్ టవర్ ఎక్కి దాదాపు రెండు గంటలపాటు వీరంగం సృష్టించాడు.

నా భార్య నాకే కావాలి.. సెల్ ఫోన్ టవర్ ఎక్కిన భర్త
X

దిశ, భూదాన్ పోచంపల్లి: భార్య తనతో పాటు ఉండడం లేదని మనస్థాపంతో ఓ భర్త సెల్ ఫోన్ టవర్ ఎక్కి దాదాపు రెండు గంటలపాటు వీరంగం సృష్టించాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణ కేంద్రానికి చెందిన కరగళ్ల బాలస్వామి (28) వృత్తిరీత్యా జెసిబి డ్రైవర్ గా పనిచేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. అయితే ఏడేళ్ల క్రితం మండలంలోని పెద్దగూడెం గ్రామానికి చెందిన బాలమణిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో భర్త తరచూ మద్యం తాగి రావడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో గత కొంత కాలంగా భార్య తన తన పుట్టింటికి వెళ్లిపోయింది.

టవర్ దిగకుండా మొండికేయడంతో...

భార్య వెళ్ళిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలస్వామి మద్యం సేవించి స్థానిక ఇండియన్ పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న సెల్ ఫోన్ టవర్ ఎక్కాడు. "నా భార్య నాకు కావాలి.. తను వస్తేనే కిందకు దిగుతా" అంటూ హంగామా చేశాడు. స్థానికులు సమాచారం అందించడంతో ఎస్సై భాస్కర్ రెడ్డి తో పాటు పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అతడిని కిందకు దింపేందుకు ప్రయత్నించారు. కానీ బాలస్వామి మొండికేయడంతో సుమారు రెండు గంటల తరబడి హైడ్రామా కొనసాగింది. చివరికి స్థానికులు పోలీసుల సాయంతో భార్య బాలమణికి ఫోన్ చేసి ఘటన స్థలానికి రప్పించారు.​ అయినా టవర్ దిగకుండా మొండికేయడంతో స్థానికులు టవర్ ఎక్కి నానా తంటాలు పడుతూ కిందికి తీసుకువచ్చారు. టవర్ దిగిన తర్వాత తనను స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story