- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రం ఆదేశించిన ఇంకా ప్రారంభం కాని మక్క కొనుగోళ్లు
తెలంగాణలో మక్కల కొనుగోళ్లకు 'క్రాప్ సర్వే' గ్రహణం! మద్దతు ధర రూ. 2400 ఉన్నా, కేంద్రాలు లేక రూ. 1600కే దళారులకు అమ్ముకుంటున్న రైతులు. అధికారుల నిర్లక్ష్యంపై రైతు సంఘాల ఆగ్రహం.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలుకు వ్యవసాయ శాఖ క్రాప్ సర్వే అడ్డంకిగా మారింది. రైతుల పంటల వివరాలను కొనుగోలు కేంద్రాలకు అందజేస్తే నిర్వాహకులు వెంటనే తూకం వేస్తారు. కానీ ఇప్పటివరకు ఆ వివరాలను సమర్పించలేదు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో పండిన పంటల వివరాలను ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో వ్యవసాయ విస్తరణాధికారులు అదే పనిలో నిమగ్నమయ్యారు. 45 రోజుల్లో వివరాలు సమర్పించాలని ఆదేశించడంతో 9వేల మంది ప్రైవేట్ సర్వేయర్లు, వాలంటీర్లను నియమించి పంట వివరాలు సేకరిస్తున్నారు.
దీంతో రాష్ట్రంలో ప్రస్తుత సీజన్లో కోతకొచ్చే పంటల వివరాలను సేకరించలేదు. ఈ ప్రభావం మక్కలు, వేరుశనగ, పొద్దు తిరుగుడు పంటల కొనుగోళ్లపై పడింది. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేసినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. మిగతా పంటలు ఐదు లక్షల ఎకరాలు సాగు చేయొచ్చని భావిస్తోంది. ఆయా పంటల కొనుగోలుకు మార్క్ ఫెడ్ సిద్ధమై మొక్కజొన్న 105, శనగకు 45, పొద్దు తిరుగుడుకు 20, మినుముల కోసం 10, వేరుశనగ కోసం ఐదు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది.
అధికారులకు అవగాహన లోపం
ఈ సీజన్లో పంట సర్వే చేయడంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం బయటపడింది. ఏటా క్రాప్సర్వే చేస్తుంటే ఈసారి ఎందుకు మండల వ్యవసాయాధికారులకు ఆదేశాలు ఇవ్వలేదని, కేంద్రం ప్రభుత్వానికి ఇచ్చే పంటల రిపోర్టుపై ఆసక్తి చూపి రాష్ట్ర పంటల వివరాలు నమోదులో ఆలసత్వం ప్రదర్శించారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిరోజు సమీక్షల పేరుతో కాలం గడపడం తప్ప రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికే ఏఈవోలు, ఏవోలు, యంత్ర పరికరాల పంపిణీ, మహిళా సంఘాలకు డ్రోన్ల అందజేత వంటి పనుల్లో బిజీగా ఉన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు మాత్రం కాలు కదలకుండా ప్రభుత్వం ఇచ్చిన అలవెన్సులతో జల్సాలు చేస్తున్నారని ఏఈవోలు చెబుతున్నారు.
దళారులను ఆశ్రయిస్తున్న రైతులు
మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2400 ఉంటే కొనుగోలు కేంద్రాలు లేక రైతులు బహిరంగ మార్కెట్లో దళారులకు రూ.1600 నుంచి రూ.1700కే అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారు. నాణ్యమైన మక్కలు దళారుల పాలైన తర్వాత ప్రభుత్వం కొంటే లాభం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. నాణ్యత పేరుతో కొర్రీలు పెట్టి మళ్లీ కొనుగోలు నిలిపివేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోతే పంట పూర్తిగా దళారుల వద్దకు చేరుతుంది. రైతులకు మేలు చేయాల్సిన పాలకులు, దళారులు దోచుకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు ఉంటుందని రైతులు ఆరోపిస్తున్నారు.
అకాల వర్షాల గుబులు
ఓ వైపు మద్దతు ధర లేక.. మరోవైపు అకాల వర్షాలకు మొక్కజొన్న తడిసిపోవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇటీవల కురిసిన వడగళ్ల వానకు మొక్కజొన్న తో పాటు ఇతర పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. బడ్జెట్‌లో పంటల బీమా గురించి ఊదరగొట్టిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.






