ప్రవాస తెలంగాణ సమాజంపై మంత్రి సీతక్క ప్రశంసలు

by Naga Rani Yarlagadda |

ప్రపంచంలో ఎక్కడున్నా ప్రవాస తెలంగాణ సమాజం మన సంస్కృతి వైభవాన్ని చాటుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క కొనియాడారు.

ప్రవాస తెలంగాణ సమాజంపై మంత్రి సీతక్క ప్రశంసలు
X
  • టీటీఏ మెగా కన్వెన్షన్‌లో ఘనంగా సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రతిష్టాపన
  • గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రవాసులు సహకరించాలని పిలుపు

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచంలో ఎక్కడున్నా ప్రవాస తెలంగాణ సమాజం మన సంస్కృతి వైభవాన్ని చాటుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క కొనియాడారు. అమెరికాలో నిర్వహించిన తెలుగు అమెరికా తెలంగాణ అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్‌లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా తమ మూలాలను, భాషను, సంస్కృతిని గర్వంగా నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక వేర్లను మరువకుండా ప్రపంచ స్థాయి విజయాలను అందుకోవడమే నిజమైన ప్రగతి అని ఆమె పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఆదివాసి సంప్రదాయం ప్రకారం వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ తల్లుల గద్దెల ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గ్రామీణ వికాసంలో భాగస్వాములు కావాలి

అమెరికాలోని తెలంగాణ కుటుంబాలు ఐక్యంగా ఉంటూ భావితరాలకు మన చరిత్ర, సంప్రదాయాలను పరిచయం చేయాలని మంత్రి సూచించారు. ప్రవాస భారతీయులు అక్కడ నేర్చుకున్న అత్యాధునిక సాంకేతికత, నిర్వహణ సామర్థ్యం, పని సంస్కృతి, నూతన ఆవిష్కరణలను తెలంగాణ అభ్యున్నతికి ఉపయోగించాలని కోరారు. ప్రతి ప్రవాసుడు ఒక విద్యార్థికి మార్గదర్శకత్వం వహించడం, ఒక ప్రభుత్వ పాఠశాలకు చేయూతనివ్వడం, ఒక మహిళా సంఘానికి అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు కల్పించడం, ఒక రైతుకు కొత్త సాంకేతికతను పరిచయం చేయడం వంటి సామాజిక బాధ్యతలను స్వీకరించాలని సీతక్క పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాలను ఆర్థిక శక్తులుగా తీర్చిదిద్దుతూ మహిళలకు ఉపాధి, వ్యాపార అవకాశాలను విస్తృతంగా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మహిళల సమగ్ర అభివృద్ధికి ప్రవాస తెలంగాణవారు కూడా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఎన్నారైల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక ఆస్తుల సృష్టికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ అభివృద్ధి పథంలో కలిసి ముందుకు సాగాలని, ప్రపంచవ్యాప్తంగా తెలుగు కీర్తిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.

Next Story